Women Cricket: స్వదేశంలో ఆస్ట్రేలియా(Australia), ఇంగ్లండ్‌(England) జట్లపై చరిత్రాత్మక విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న మహిళల క్రికెట్‌ జట్టుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(BCCI) శుభవార్త చెప్పింది. పురుషుల క్రికెట్‌ మాదిరిగానే తమకూ దేశవాళీలో రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడించాలని మహిళలు ఎప్పటినుంచో కోరుతున్నారు. రంజీల మాదిరిగా మహిళలకు టోర్నమెంట్‌ నిర్వహించాలన్న డిమాండ్‌ ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకూ రెడ్‌ బాల్‌ క్రికెట్‌ అందుబాటులోకి తీసుకురానుంది. జోనల్‌ ఫార్మాట్‌లో సాగబోయే ఈ మ్యాచ్‌లను మార్చి – ఏప్రిల్‌ నెలలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముగిసిన వెంటనే మహిళల రెడ్‌ బాల్‌ క్రికెట్‌ మొదలవనుంది. మెన్స్‌ దులీప్‌ ట్రోఫీ విధానం మాదిరిగా... మహిళల రెడ్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. దేశవాళీలో పురుషుల రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో నాలుగు రోజులు ఆడుతుండగా.. మహిళలకు మాత్రం మూడు రోజుల మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఫైనల్‌ మాత్రం నాలుగు రోజులు ఉండనుంది.


గతంలో ఉన్నా బ్రేక్‌
మహిళలకు దేశవాళీ క్రికెట్‌లో 2014-15 సీజన్‌ నుంచి 2017-18 దాకా బీసీసీఐ ఇలాంటి మ్యాచ్‌లను నిర్వహించింది. కానీ తర్వాత పలు కారణాలతో వీటికి బ్రేక్‌ పడింది. కానీ గడిచిన కొంతకాలంగా మహిళల క్రికెట్‌కు క్రేజ్‌ పెరిగింది. యువతులు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్న నేపథ్యంలో బీసీసీఐ దేశవాళీలో రెడ్‌ బాల్‌ క్రికెట్‌ పోటీలను తిరిగి ప్రారంభించనుంది.


టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే భారీ విజయం
మహిళా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే భారీ విజయం నమోదైంది. ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో టీమిండియాచరిత్ర సృష్టించింది. ఏకంగా 347 పరుగుల తేడాతో బ్రిటీష్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. వుమెన్స్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం. నాలుగు రోజులపాటు జరిగే...... టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంతకుముందు ఏ జట్టు ఇంత భారీ విజయాన్ని నమోదు చేయలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో.... 428 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం ఇంగ్లాండ్‌ను ఫాలో ఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా  6 వికెట్ల నష్టానికి 186 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం... బ్రిటీష్‌ మహిళల జట్టును రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూల్చి... 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై తొమ్మిది వికెట్లు నేలకూల్చి దీప్తి శర్మ ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా దీప్తి శర్మ ఎంపికైంది. 


కంగారులపై తొలి టెస్ట్‌ విజయం
స్వదేశంలో భారత అమ్మాయిలు చెలరేగిపోయారు. పటిష్టమైన ఆస్ట్రేలియా(Austrelia)ను మట్టికరిపించి.... కంగారులపై తొలి టెస్ట్‌ విజయాన్ని నమోదు చేశారు. ఇటీవలే ఏకైక టెస్టులో ఇంగ్లాండ్‌(England)ను ఓడించి చరిత్ర సృష్టించిన భారత మహిళలు... ఇప్పుడు ఆస్ట్రేలియాను కూడా ఓడించి కొత్త చరిత్రకు నాంది పలికారు. టెస్టు క్రికెట్‌(Test Cricket) చరిత్రలో ఆసీస్‌పై తొలిసారి భారత మహిళల జట్టు విజయం సాధించింది. ముంబయి(Mumbai)లోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఆస్ట్రేలియాతో ఇప్పటివరకూ 11 టెస్టుల్లో తలపడిన టీమ్ఇండియా(Team India)కు ఇదే తొలి టెస్ట్‌ విజయం. ఈ విజయంతో మహిళల టెస్ట్‌ చరిత్రలో భారత మహిళల జట్టు నవ శకానికి నాంది పలికింది.