Ranji Trophy 2024: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2024 (Ranji Trophy 2024) సీజన్‌లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) పరుగుల వరద పారిస్తున్నాడు. సీజన్‌లో వరుసగా రెండో సెంచరీతో చేసి సత్తా చాటాడు. ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 87 బంతుల్లోనే 11 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేసిన రియాన్.. కేరళతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో మరో బాధ్యతాయుతమైన శతకం బాదాడు. రియాన్ చేసిన ఈ రెండు శతకాలు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడివే కావడంతో రియాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాలో ఆన్ ఆడే సమయంలో శతక్కొట్టిన రియాన్.. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో తన జట్టు 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో సెంచరీతో ఆదుకున్నాడు.
మ్యాచ్ సాగిందిలా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులకు ఆలౌటైంది. సచిన్ బేబి 131 పరుగులతో చెలరేగగా... కున్నుమ్మల్ 83, కృష్ణ ప్రసాద్ 80 పరుగులతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్ హుసేన్, రాహుల్ సింగ్ చెరో 3 వికెట్లు, సిద్దార్థ్ శర్మ 2, ఆకాశ్‌సేన్ గుప్తా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రియాన్ పరాగ్ (116) బాధ్యతాయుతమైన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రియాన్ మినహా మిగిలిన బ్యాటర్లందరూ విఫలం కావడంతో 212 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి అస్సాం కష్టాల్లో పడింది. ఇప్పటికీ కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు అస్సాం 207 పరుగులు వెనుపడి ఉంది.
ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో విధ్వంసం
చత్తీస్‌ఘడ్(Chattisgarh) తో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం (Assam) సారధి రియాన్ పరాగ్(Riyan Parag) విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రియాన్ అరుదైన ఘనత సాధించాడు. చత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం సారధి రియాన్ పరాగ్ కేవలం 56 బంతుల్లోనే సెంచరీ చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వేగవంతమైన శతకం చేసిన భారత ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. పరాగ్ 87 బంతుల్లోనే 11 బౌండరీలు, 12 భారీ సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేశాడు. అయితే 56 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా పరాగ్.. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ సరసన చేరాడు. 1985-86 సీజన్‌లో రిచర్డ్స్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 56 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇప్పుడు పరాగ్.. రిచర్డ్స్ రికార్డును సమం చేశాడు. భారత్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాళ్లలో పరాగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో శక్తి సింగ్ 45 బంతులలో, వికెట్ కీపర్ రిషభ్ పంత్ 48 బంతుల్లో.. యూసుఫ్ పఠాన్ 51, ఆర్‌కె బోరా 56 బంతుల్లోనే శతకం శతకాలు సాధించి పరాగ్ కంటే ముందున్నారు.
పరాగ్ రాణించినా పరాజయమే
పరాగ్ రాణించినా ఛత్తీస్‌గఢ్ చేతిలో అస్సాం చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది. అస్సాం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేసింది. 87 పరుగుల లక్ష్యాన్ని ఛత్తీస్‌గఢ్ వికెట్ కోల్పోకుండా ఛేదించింది.