Cricket World Cup 2023:  పుష్కరకాలం తర్వాత  స్వదేశంలో  ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌నకు ఆతిథ్యమివ్వబోతున్న భారత్.. ఆ మేరకు  ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నది. సౌకర్యాలు లేక వెలవెలబోతున్న  దేశంలోని స్టేడియాల రూపు మార్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి  కంకణం కట్టుకుంది. వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని.. మెగా టోర్నీలో  స్టేడియాలు మెరిసేందుకు గాను    వందల కోట్లు ఖర్చు చేయనున్నది. వరల్డ్ కప్ కోసం  ఇదివరకే ఎంపిక చేసిన 12   నగరాలలోని స్టేడియాల్లో  ఐదింటిని  కొత్త రూపును ఇవ్వనుంది.   ఇందులో హైదరాబాద్ లోని  ఉప్పల్ లో ఉన్న  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం  కూడా ఉంది.  


ఉప్పల్‌తో పాటు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ  స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్, ముంబైలోని వాంఖెడే, మొహాలీ స్టేడియాలలో పునిర్నిర్మాణ ప్రక్రియను బీసీసీఐ చేపట్టనుంది.  ఈ మేరకు   రూ. 500 కోట్లను ఖర్చు చేయనుంది. అక్టోబర్   నుంచి వన్డే వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో అప్పటిలోగా  స్డేడియాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు  ప్రణాళికలు  రచిస్తోంది.  ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ - 16 ముగిశాక ఈ పునర్నిర్మాణ  పనులు మొదలవుతాయి.  


ఏ ఏ స్టేడియానికి ఎంత..? 


-  ఢిల్లీ : రూ. 100 కోట్లు 
- హైదరాబాద్ : రూ. 117. 17 కోట్లు 
- కోల్‌కతా : రూ. 127.47 కోట్లు 
- మొహాలి : రూ. 79.46 కోట్లు 
- ముంబై : రూ. 78.82 కోట్లు 


ఉప్పల్‌కు మహర్దశ.. 


భాగ్యనగరంలో ఉన్న ఉప్పల్  స్టేడియాన్ని పునర్నిర్మాణం చేపట్టలని  చాలా రోజుల  నుంచే ఫ్యాన్స్ కోరుతున్నారు.  ఉప్పల్ లో  ఉత్తర, దక్షిణ స్టాండ్ ‌లపై  మాత్రమే పైకప్పు ఉంది.  దక్షిణం వైపు ఉన్న  పై కప్పు కూడా దెబ్బతిని చాలాకాలం అవుతున్నది. ఇప్పటికీ డే మ్యాచ్ లు జరిగితే  ఫ్యాన్స్ ఎండకు మాడిపోవాల్సిందే. ఇక 2019 తర్వాత గతేడాది అక్టోబర్ లో  ఆస్ట్రేలియాతో  మూడో టీ20కి ఉప్పల్ ఆతిథ్యమివ్వగా.. కుర్చీలపై  పక్షుల మల విసర్జితాలు ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.  మ్యాచ్ లు లేకుంటే స్టేడియం నిర్వహణ అద్వాన్నంగా  ఉందంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టేడియం మొత్తం పైకప్పుతో ఆధునీకరణ పనులు చేపట్టేందుకు బీసీసీఐ  ప్రణాళికలు రచిస్తోంది. ఇవన్నీ జరిగితే ఉప్పల్  స్డేడియం కొత్త రూపును సంతరించుకోవడం ఖాయం. 


మొహాలీలో మ్యాచ్‌లు లేకున్నా.. 


వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 12 నగరాలలో  వాస్తవానికి మొహాలీ లేదు. కానీ  ఇక్కడ కనీస సదుపాయాలు కూడా లేక  ప్రేక్షకులు ఇబ్బందిపడుతున్నారు.  ఐపీఎల్ -16లో భాగంగా  పంజాబ్ కింగ్స్ తో కేకేఆర్ ఆడిన మ్యాచ్ లో  ఫ్లడ్ లైట్లు వెలగక మ్యాచ్‌ను  15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు.  ఇక్కడ కూడా   ప్రేక్షకులకు పై కప్పులు లేక ఇబ్బందులు పడుతున్నారు.  మొహాలీని పునర్నిర్మించాలని చాలాకాలంగా ఫ్యాన్స్ కోరుతున్నా  బీసీసీఐ  ఇప్పుడు కనికరించింది. 


ఇక ముంబై (వాంఖెడే),   ఈడెన్ గార్డెన్, అరుణ్ జైట్లీ  స్టేడియాల్లో వసతులపై గతంలో ఫ్యాన్స్  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  భారత్ స్వదేశంలో  ఏ ద్వైపాక్షిక సిరీస్ ఆడినా ఈ మూడింట్లోనే ఎక్కువగా ఆడుతోంది. వరల్డ్ కప్ నేపథ్యంలో వీటిని  ఆధునీకరించేందుకు బీసీసీఐ నడుం కట్టడం శుభసూచికమే.