Border Gavaskar Trophy: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మూడో టెస్ట్ మ్యాచ్ వేదిక మారనుంది. ధర్మశాల నుంచి మ్యాచ్ ను మోహాలీకి తరలించనున్నట్లు సమాచారం. పునరుద్ధరణ పనులు పూర్తవనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. దీనికి ధర్మశాల ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పుడు వేదికను మొహాలికి మార్చనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మశాల మైదానంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అవుట్ ఫీల్డ్ ను పునర్మిస్తున్నారు. ఇంకా ఈ పనులు పూర్తవలేదు. ఇంకా మూడో టెస్టుకు రెండు వారాల సమయమే ఉన్నందున వేదికను మార్చనున్నట్లు సమాచారం. దురదృష్టవశాత్తూ మూడో టెస్టును ధర్మశాల నుంచి మార్చాల్సి వస్తోంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఇది అందుబాటులో ఉండదు. వేదికను సిద్ధం చేసేందుకు హెచ్ పీసీఏ చేయాల్సిందంతా చేస్తోంది. అయితే అంతర్జాతీయ స్థాయికి తిరిగి రావడానికి అవుట్ ఫీల్డ్ కు ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితిలో అక్కడ మ్యాచ్ నిర్వహించడం అసాధ్యం అని బీసీసీఐ కు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
మొహాలీలో మూడో టెస్ట్!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం ఈ మైదానంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక మధ్య టీ20 మ్యాచ్ కు ఈ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. అప్పట్నుంచి అక్కడ అంతర్జాతీయ మ్యాచ్ లు జరగలేదు. ఫిబ్రవరి 3న ఈ మైదానాన్ని తనిఖీ చేసిన బీసీసీఐ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేశారు. హెచ్ పీసీఏ అవుట్ ఫీల్డ్ ను రెన్యూ చేసి కొత్త డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే స్టాండ్ లు, మీడియా రూమ్ లోని కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని మార్చి 1 నాటికి సిద్ధం చేయగలిగినప్పటికీ.. అవుట్ ఫీల్డ్ మాత్రం సిద్ధమవదు. పనులు పూర్తయిన తర్వాత మేం ప్రపంచకప్ కు ముందు అక్కడ కొన్ని మ్యాచ్ లు నిర్వహించడానికి ప్రయత్నిస్తాం. ఇక మూడో టెస్ట్ విషయానికొస్తే మొహాలి టెస్ట్ ను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. అయితే వైజాగ్, పుణె, ఇండోర్ లు కూడా మా ఆలోచనలో ఉన్నాయి. అని ఆ అధికారి తెలిపారు.
ఫిబ్రవరి 17న ప్రారంభం కానున్న దిల్లీ టెస్టుకు టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. మూడో టెస్టుపై అనిశ్చితి ఉన్న కారణంగా బీసీసీఐ ఇంకా దానికి టికెట్లను విడుదల చేయలేదు. నాలుగో టెస్ట్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది.