Rishabh Pant Photo:  గతేడాది డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఆ ఘోర ప్రమాదం తర్వాత దాదాపు నెలన్నరపాటు ఆసుపత్రిలో ఉన్న పంత్ ఇప్పుడు ఇంటికి వెళ్లాడు. ఆ ప్రమాదం తర్వాత పంత్ తొలిసారి తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. 


రోడ్డుప్రమాదం తర్వాత తొలిసారి రిషభ్ పంత్ సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలను పంచుకున్నాడు. ఊతకర్రల సాయంతో నడుస్తున్న తన రెండు చిత్రాలను పోస్ట్ చేసిన పంత్ వాటికింద ఇలా రాసుకొచ్చాడు. 'ఒక అడుగు బలంగా, ఒక అడుగు ముందుకు, ఒక అడుగు మెరుగ్గా' అనే క్యాప్షన్ ను జతచేశాడు. ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి పంత్ కు దాదాపు 6 నుంచి 9 నెలలు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఈ ఏడాది మొత్తానికి రిషభ్ పంత్ క్రికెట్ కు దూరమయ్యాడు. 






అండగా బీసీసీఐ


డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రసుత్తం అతనికి లిగ్ మెంట్ స్నాయువు శస్త్రచికిత్స జరిగింది. ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు ఈ సర్జరీ నిర్వహించారు. ఇదంతా బీసీసీఐ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అలాగే పంత్ కు ఆర్ధికంగా అండగా నిలబడాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. 


పూర్తి శాలరీ ఇవ్వనున్న బీసీసీఐ


ప్రమాదం కారణంగా పంత్ దాదాపు 6 నుంచి 9 నెలలు క్రికెట్ కు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది చాలా క్రికెట్ టోర్నీలకు దూరమయ్యాడు. ఐపీఎల్, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు ఈ బ్యాటర్ దూరమయ్యాడు. అలాగే స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ నకు అందుబాటులో ఉండడం అనుమానమే. అయినప్పటికీ రిషభ్ పంత్ కు అతని మొత్తం శాలరీని ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అలాగే ఐపీఎల్ ఆడనప్పటికీ పంత్ కాంట్రాక్ట్ ప్రకారం అతని రూ. 16 కోట్ల శాలరీని బోర్డు చెల్లించనుందట. అంతేకాకుండా సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం అతనికి ఇవ్వాల్సిన రూ. 5 కోట్ల జీతాన్ని ఇవ్వనుందట.