Indian Team Players Match Fee: బీసీసీఐ నూతన పాలక కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్లో లింగ విచక్షణకు చరమగీతం పాడింది. పురుషులతో సమానంగా మహిళలకూ వేతనాలు ప్రకటించింది. ఇకపై కాంట్రాక్టు క్రికెటర్లకు జెండర్‌తో సంబంధం లేకుండా సమానంగా డబ్బులు చెల్లిస్తామని వెల్లడించింది. భారత క్రికెట్ సరికొత్త సమానత్వ శకంలోకి అడుగు పెడుతోందని స్పష్టం చేసింది. ఈమేరకు బోర్డు కార్యదర్శి జే షా ట్వీట్ చేశారు.
'ఇక నుంచి పురుషుల మాదిరిగానే మహిళా క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజ్ వస్తుంది. టెస్టులకు రూ.15 లక్షలు, వన్డేలకు రూ.6 లక్షలు, టీ20లకు రూ.3 లక్షలు చెల్లిస్తాం. సమాన వేతనాలు ఇవ్వాలన్నది నా కమిట్‌మెంట్. మద్దతు పలికినందుకు అపెక్స్ కౌన్సిల్‌కు ధన్యవాదాలు. జై హింద్' అని జే షా ట్వీటారు.
భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఇక స్వర్ణం యుగం మొదలైనట్టే అనుకోవాలి! ఒకప్పుడు స్పాన్సర్లు లేక విదేశాలకు వెళ్లలేకపోయిన అమ్మాయిలు కొన్నేళ్ల క్రితమే బీసీసీఐ పరిధిలోకి వచ్చారు. అప్పట్నుంచి అమ్మాయిల క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాకుండా రెండుసార్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్, ఒకసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరుకోవడంతో అభిమానుల సంఖ్య పెరిగింది. వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ సైతం మొదలవుతోంది. కొన్నాళ్ల క్రితమే ఏజీఎంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
2023 మార్చిలో మహిళల ఐపీఎల్ టోర్నీ నిర్వహిస్తారని తెలిసింది. మహిళల టీ20 ప్రపంచకప్ ముగిశాక, పురుషుల ఐపీఎల్ ముందు టోర్నీ జరుగుతుంది. ప్రస్తుతం పురుషుల ఐపీఎల్‌లో తుది జట్టులో గరిష్ఠంగా నలుగురు విదేశీయులకు చోటు ఉంటుంది. మహిళల జట్టులోనూ ఇదే అనుసరించనున్నారు. శాశ్వత దేశాల నుంచి నలుగురు విదేశీయులు, అసోసియేట్ సభ్య దేశం నుంచి ఒక్కరు జట్టులో చోటు దక్కించుకుంటారు. మొత్తంగా ఒక్కో జట్టులో 18 మంది క్రికెటర్లు ఉండొచ్చు. ఆరుగురు విదేశీ అమ్మాయిలను తీసుకోవచ్చని తెలిసింది.