Asia Cup 2023: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు పాకిస్తాన్ వెళ్లనున్నారా..? త్వరలో మొదలుకాబోయే ఆసియా కప్ - 2023 నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంపిన ఆహ్వానం మేరకు ఈ ఇద్దరూ దాయాది దేశంలో పర్యటిస్తారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. శ్రీలంకతో పాటు స్వదేశంలో నిర్వహిస్తున్న ఆసియా కప్‌ను చూసేందుకు పాకిస్తాన్‌కు రావాలని పీసీబీ.. బీసీసీఐతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్యులకు ఆహ్వానం పంపింది. పీసీబీ ఆహ్వానం మేరకు బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పాక్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తున్నది.
బీసీసీఐ వర్గాలు తెలపిన సమాచారం మేరకు.. ‘పాకిస్తాన్‌లో జరుగబోయే ఆసియా కప్ మ్యాచ్‌లను వీక్షించేందుకు గాను పీసీబీ.. బీసీసీఐతో పాటు ఏసీసీ సభ్యులనూ ఆహ్వానించింది. ఈ మేరకు బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని పాకిస్తాన్ పంపేందుకు సమ్మతించింది. అయితే ఈ ఇద్దరూ ముందు శ్రీలంకలో భారత్ - పాక్ మ్యాచ్ (సెప్టెంబర్ 2న) ను వీక్షించి ఆ తర్వాత పాకిస్తాన్‌కు బయల్దేరతారు..’ అని ఓ ప్రతినిధి తెలిపాడు.
భారత్ - పాక్ మ్యాచ్ చూసిన తర్వాత సెప్టెంబర్ 3న పాకిస్తాన్‌కు చేరుకునే బిన్నీ, శుక్లాలు.. ఆనెల 5న లాహోర్ వేదికగా అఫ్గానిస్తాన్ - శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌ను చూడనున్నారు. కాగా.. బిన్నీ, శుక్లాలు గనక పాకిస్తాన్‌కు వెళ్తే 2012 తర్వాత ఆ దేశానికి వెళ్లబోయే తొలి బీసీసీఐ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అవుతారు. గడిచిన పదకొండు ఏండ్లుగా బీసీసీఐ ప్రతినిధులెవరూ పాకిస్తాన్‌లో పర్యటించలేదు.
బోర్డు సభ్యుల అసంతృప్తి..?
బిన్నీ, శుక్లాలు పాకిస్తాన్ వెళ్లడంపై బీసీసీఐలోనే విభేదాలు వచ్చినట్టు తెలుస్తున్నది. చర్చోపచర్చల మధ్య పాకిస్తాన్‌కు వెళ్లనున్న ఈ ఇద్దరిపై బోర్డులోని ఒక వర్గం అసంతృప్తిగా ఉందట. పాకిస్తాన్ కు వెళ్లేందుకు భారత జట్టును అనుమతించని బీసీసీఐ.. తమ ప్రతినిధులను మాత్రం ఆ దేశానికి పంపడం సరికాదన్న భావనలో ఆ వర్గం ఉన్నట్టు తెలుస్తున్నది. టీమిండియాను పంపడానికి ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అన్న బీసీసీఐ.. బిన్నీ, శుక్లాలను పంపేందుకు కూడా ప్రభుత్వ ఆమోదం తీసుకుందా..? లేదా..? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘అవును. పాకిస్తాన్ ఆహ్వానం మాకు అందింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌లో పర్యటించడం కరెక్ట్ కాదు. ఆటగాళ్లే కాదు. అధికార ప్రతినిధులు కూడా భారత ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. మాకైతే ప్రభుత్వం నుంచి ఇంకా క్లీయరెన్స్ రాలేదు..’ అని ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌తో అన్నారు.
వాస్తవానికి పీసీబీ అధ్యక్షుడు జకా అష్రఫ్.. గతనెలలోనే ఏసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జై షాను ఆసియా కప్ చూసేందుకు రావాలని ఆహ్వానించాడు. జై షా తో పాటు ఐసీసీ అధ్యక్షుడు గ్రెగ్ బార్క్‌లే, ఎగ్జిక్యూటివ్ చీఫ్ జెఫ్ అలార్డిస్‌లను కూడా ఆహ్వానించాడు. ఏసీసీ సభ్య దేశాలకూ అందిన ఆహ్వానం మేరకు బిన్నీ, శుక్లాలు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. కానీ జై షా మాత్రం పాకిస్తాన్‌కు వెళ్లేది అనుమానమేనని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్‌కు ముందే ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదని సంచలన ప్రకటన చేసి తన పంతం నెగ్గించుకున్న జై షా.. పాకిస్తాన్‌కు వెళ్లకూడదన్న అభిప్రాయంతో ఉన్నాడని సమాచారం.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial