BCCI announces Test cricket incentive of upto Rs 45 lakh per match: వ‌న్డేలు, టీ20ల రాక‌తో టెస్టు క్రికెట్‌కు ఆద‌ర‌ణ త‌గ్గిపోతుంది. కొంద‌రు ఆట‌గాళ్లు లీగ్‌లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. టెస్టు క్రికెట్‌ ఆడే ఆకలి లేని క్రికెటర్లను టీంలోకి తీసుకోవద్దంటూ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఇటీవల వ్యాఖ్యానించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌పై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలకు క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌(Sunil Gavaskar) కూడా మద్దతు తెలిపాడు. రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు పూర్తి నిజమని.. టెస్టు క్రికెట్‌ ఆడాలనుకునే వారినే ఎంపిక చేయాలని సెలక్షన్‌ కమిటీకి సూచించాడు. ఈ సూచనలతో బీసీసీఐ మరిన్ని చర్యలు తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు అయిన బీసీసీఐ... సెంట్రల్‌ కాంట్రాక్టులో ఉండి టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులను పెంచడంతో పాటు బోనస్‌ కూడా ప్రకటించింది. 

 

బీసీసీఐ నజరాన

టెస్టు క్రికెట్‌ను ఎక్కువ మంది క్రికెటర్లు ఆడేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంది. టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఒక సీజన్‌లో కనీసం 50 శాతం కంటే ఎక్కువ టెస్టులు ఆడితే  30 లక్షల నుంచి 45 లక్షలు అదనంగా చెల్లిస్తామని జై షా ప్రకటించారు. రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లకు ఇందులో సగం ఇస్తామని ప్రకటించారు. టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి... ఆటగాళ్లను ప్రోత్సహించడానికి.. ఈ అద్భుత స్కీమ్‌ను తీసుకొచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. కొత్త స్కీమ్ 2022-23 సీజన్ నుంచి అమలులోకి రానుంది. ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు బీసీసీఐ ఒక్కో సీజన్‌కు అదనంగా రూ.40 కోట్లు కేటాయించింది.  కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి క్రికెటర్లు.. టెస్టు క్రికెట్‌ను కాదని ఐపీఎల్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

నాలుగు గ్రేడ్‌లు

బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులో నాలుగు గ్రేడ్స్‌ ఉన్నాయి. వీటిని ఏ+, ఏ, బీ, సీ గా విభజించారు. ఏ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు యేటా రూ. 7 కోట్లు... ఏ కేటగిరీలో క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 3 కోట్ల వేతనం దక్కుతోంది. సీ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు వార్షిక వేతనం కింద కోటి రూపాయలు అందుతున్నాయి. టెస్టు మ్యాచ్‌లు ఆడినందుకు గాను ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, వన్డేలు ఆడితే రూ. 6 లక్షలు, టీ20లకు రూ. 3 లక్షలు దక్కుతాయి.

 

రోహిత్‌కు గవాస్కర్‌ మద్దతు

సుదీర్ఘ ఫార్మాట్‌పై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలకు క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ మద్దతు తెలిపాడు. టెస్టు క్రికెట్‌ ఆడే ఆకలి లేని క్రికెటర్లను టీంలో కి తీసుకోవద్దంటూ రోహిత్‌ శర్మ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను సునీల్ గవాస్కర్‌ సమర్ధించాడు. రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు పూర్తి నిజమని.. టెస్టు క్రికెట్‌ ఆడాలనుకునే వారినే ఎంపిక చేయాలని సెలక్షన్‌ కమిటీకి సూచించాడు. తాను ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెబుతున్నానని గుర్తు చేశాడు. భారత క్రికెట్‌ వల్లే ప్రతి ఆటగాడికి పేరు, డబ్బు, గుర్తింపు వచ్చాయని భారత క్రికెట్‌పై క్రికెటర్లు విధేయత చూపాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఎవరైనా ఏ కారణం చేతనైనా పదే పదే దేశానికి ఆడను అని అంటే కచ్చితంగా యువ ఆటగాళ్లకు మరిన్ని ఎక్కువ అవకాశాలివ్వాలని గవాస్కర్‌ సూచించాడు. ఇలాంటి వైఖరిని సెలెక్టర్లు అలవర్చుకుంటే భారత క్రికెట్‌కు మేలు చేస్తుందని గవాస్కర్‌ అన్నాడు.