Ravichandran Ashwin : వందో టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో డకౌట్ అయి నిరాశపరిచారు. దీంతో వందో టెస్టులో డకౌటైన మూడో భారత క్రికెటర్, ఓవరాల్ గా తొమ్మిదో ప్లేయర్ గా అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. కాగా వందో టెస్టులో డకౌటైన తొలి భారత ఆటగాడిగా దిలీప్ వెంగ్‌సర్కార్‌ (1988) రికార్డులకెక్కారు. తర్వాత అశ్విన్‌ కూడా వందో టెస్ట్‌లో డకౌట్‌ అయ్యాడు. అలన్ బోర్డర్, కోర్ట్నీ వాల్ష్, మార్క్ టేలర్,  స్టీఫెన్ ఫ్లెమింగ్, అలిస్టర్ కుక్, బ్రెండన్ మెకల్లమ్ కూడా వందో టెస్ట్‌లో పురగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరారు.  

 

అశ్విన్‌కు సత్కారం

 టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఖాతాలోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టులో బరిలోకి దిగిన అశ్విన్‌కి ఇది  వందో టెస్టు మ్యాచ్.  దీంతో వందవ టెస్టు ఆడుతున్న 14వ ఇండియన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఈ అవార్డును  అశ్విన్ కి ముందు  భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్ , రాహుల్ ద్రవిడ్ , వీవీఎస్ లక్ష్మణ్ , అనిల్ కుంబ్లే , కపిల్ దేవ్ , సునీల్ గవాస్కర్ , దిలీప్ వెంగ్‌సర్కార్ , సౌరవ్ గంగూలీ , విరాట్ కోహ్లీ , ఇషాంత్ శర్మ , హర్భజన్ సింగ్ , పుజారా ఉన్నారు.

 

అతనో అద్భుతం

రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ఓ క్రికెట్‌ మేధావి. బ్యాటర్లు ఆడే షాట్‌ను ముందే ఊహించి దానికి తగ్గట్లుగా బౌలింగ్‌ను మార్చుకుని వికెట్లను తీసే మేధావి. అందుకే టీమిండియా హెడ్‌కోచ్‌ ద్రావిడ్‌ కూడా తాను అశ్విన్‌లా క్రికెట్‌ మేధావిగా ఆలోచించాల్సి వస్తుందని ఓసారి వ్యాఖ్యానించాడు. జట్టు కోసం ఏ త్యాగానికైనా.. ఎంతటి కష్టానికైనా అశ్విన్‌ సిద్ధంగా ఉంటాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్లను కకావికలం చేసి టీమిండియాకు విజయం సాధించిపెట్టగల ధీరుడు. జట్టుకు వికెట్‌ అవసరమైన ప్రతీసారి కెప్టెన్‌ చూపు అశ్విన్‌ వైపే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మైదానంలోనూ అశ్విన్‌ అగ్రెసివ్‌గానే ఉంటాడు. మన్కడింగ్‌ ద్వారా బ్యాటర్‌ను అవుట్‌ చేసి... అది తప్పైతే నిబంధనల పుస్తకంలో ఎందుకు ఉందంటూ ధైర్యంగా అడిగే క్రికెటర్‌ అశ్విన్‌. అందుకే అంతర్జాకీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి 12 ఏళ్లు దాటినా ఈ స్పిన్ మాంత్రికుడు.. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను వణికిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ క్రికెట్‌ జీనియస్‌ వందో టెస్ట్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు.

 

ఇంగ్లాండ్‌ ఖేల్‌ ఖతమే

భారత్ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. భారత స్పిన్నర్ల ధాటికి విలవిలాడుతోంది. లంచ్‌ సమయానికి అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అశ్విన్, కుల్‌దీప్‌ స్పిన్‌ మాయాజాలం ప్రారంభం కావడంతో వరుసగా వికెట్లు కోల్పోతోంది.