BCCI announces extension contracts for Head Coach: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసిందని, ఆయన స్థానంలో కొత్త కోచ్ వస్తారని ప్రచారం జరుగుతుండగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోచ్, సపోర్ట్ స్టాఫ్ పై అధికారిక ప్రకటన చేసింది. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా కొనసాగుతారని, అదే విధంగా సపోర్టింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్ ను బీసీసీఐ పొడిగించింది. బీసీసీఐ తాజా ప్రకటన ప్రకారం.. టీమిండియా (Team India) హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్‌ రాఠోడ్, బౌలింగ్‌ కోచ్ పరాస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్ కొనసాగనున్నారు. అయితే ఎంతవరకూ వీరు పదవిలో కొనసాగుతారనేది బీసీసీఐ వెల్లడించలేదు. పరిస్థితి గమనిస్తే వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ నకు వీరే సేవలు అందించేలా కనిపిస్తోంది. 


రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా టీమిండియా వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ చేరింది. మరోవైపు ద్రావిడ్ కాంట్రాక్ట్ ముగియడంతో తాను తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ హెడ్ కోచ్ గా ద్రావిడే ఉండాలని, మాజీ క్రికెటర్లతో పాటు బీసీసీఐ పెద్దలు పదే పదే కోరడంతో చివరకు ఒకే చెప్పాడు. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగర్కార్‌ కూడా ద్రావిడ్ హెడ్ కోచ్ గా ఉండాలని కోరడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని హెడ్ కోచ్ గా కొనసాగేందుకు అంగీకరించాడు. హెడ్ కోచ్ ద్రావిడ్ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కాంట్రాక్టులను సైతం పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.






రాహుల్ ద్రావిడ్ దార్శనికత, స్కిల్స్ టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాయని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ చెప్పారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా, ద్రావిడ్ పేరు ఎప్పుడూ పరిశీలనతో ఉంటుంది. సవాళ్లను స్వీకరించడమే కాకుండా వాటిలో రాణిస్తున్న ద్రావిడ్ ను ప్రశంసించారు. ద్రావిడ్ కోచింగ్ లో జట్టు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుందన్నారు. 


ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ ద్రావిడ్‌ని మించిన వ్యక్తి లేడని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. అతడి నిబద్ధత, ఆట పట్ల అంకితభావం నిరూపించకున్న వ్యక్తి ద్రావిడ్. జట్టును అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ చేయగల సమర్థుడు అతడు. వన్డే ప్రపంచ కప్ లో వరుసగా 10 మ్యాచ్ లు నెగ్గి టీమిండియా ఫైనల్ చేరడం ద్రావిడ్ మార్గదర్శకత్వానికి నిదర్శనం అన్నారు. ద్రావిడ్ కు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందన్నారు.


హెడ్ కోచ్ గా తన కాంట్రాక్ట్ పొడిగించడంపై రాహుల్ ద్రావిడ్ స్పందించారు. తనపై నమ్మకం ఉంచిన అందరికీ ధన్యవాదాలు. నా దార్శనికతను ఆమోదించినందుకు సంతోషంగా ఉంది. గత రెండేళ్లుగా టీమిండియాతో అనుబంధాన్ని మాటల్లో చెప్పలేను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. డ్రెస్సింగ్ రూమ్‌లో మా బాండింగ్ గొప్పగా ఉంది. నా కుటుంబం త్యాగాలు, మద్దతు సైతం ఎంతో విలువైనది. ప్రపంచ కప్ తర్వాత కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని రాహుల్ ద్రావిడ్ అన్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply