బంగ్లాదేశ్(Bangladesh) గ‌డ్డపై జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌(Test Series)లో న్యూజిలాండ్ ( New Zealand) చిరస్మరణీయ విజయం సాధించింది. కీల‌క‌మైన‌ రెండో టెస్టులో అద్భుత విజయంతో సిరీస్‌ను సమం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కివీస్‌ నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజ‌యం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో కివీస్‌ సమం చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ర‌స‌వ‌త్తరంగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్‌ 40 పరుగులతో అజేయంగా నిలిచి మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు. మిచెల్‌ శాంట్నర్‌ 35 పరుగులతో ధ‌నాధ‌న్ ఆట‌తో అండ‌గా నిలిచాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై ఫిలిప్స్‌, శాంట్నర్‌ అద్బుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. స్వల్ప ఛేద‌న‌లో కేన్ విలియ‌మ్సన్‌(11), డారిల్ మిచెల్(19), టామ్ బండిల్‌(2) చేతులెత్తేశారు. దాంతో, కివీస్ ఓట‌మి ఖాయ‌మ‌నుకున్నారంతా. కానీ, ఫిలిఫ్స్, శాంట్న‌ర్ అద్భుతం చేశారు. వీళ్లిద్దరూ ఏడో వికెట్‌కు 70 ర‌న్స్ జోడించి బంగ్లాదేశ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. 



తొలి ఇన్నింగ్స్‌లో 87 ప‌రుగుల‌ విలువైన ఇన్నింగ్స్ ఆడిన ఫిలిఫ్స్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ నిల‌బ‌డ్డాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో స‌మం చేసింది. బంగ్లా బౌలర్లలో మెహది హసన్‌ మిరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. తైజుల్‌ ఇస్లాం రెండు, షోర్‌ఫుల్‌ ఇస్లాం ఒక వికెట్‌ సాధించారు. 
 అంతకుముందు 38/2 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 144 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ ఆజాజ్ పటేల్ 6 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శాంట్నర్‌ 3 వికెట్లు సాధించాడు. కాగా కివీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో కూడా గ్లెన్‌ ఫిలిప్స్‌ 87 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.



రెండో టెస్టు తొలి రోజే పది వికెట్లు నేలకూలాయి. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తున్న వేళ స్పిన్నర్లు చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 172 పరుగులకే కుప్పకూలగా తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 55 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అనూహ్యంగా తిరుగుతూ బౌన్స్‌ అవుతున్న బంతిని ఆడడం బ్యాటర్ల వల్ల కాలేదు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్ల మాయాజాలంతో ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 66.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్ల ధాటికి ఆది నుంచే బంగ్లా బ్యాటర్లు విలవిలలాడారు. 29 పరుగులకే ఓపెనర్లు మహ్మదుల్ హసన్ (14), జకీర్ హుస్సేన్ (8) వెనుదిరిగారు. కాసేపటికే మోమినల్ (5), కెప్టెన్ షాంటో (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన ముష్ఫికర్ (35), హోస్సేన్ (31) వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. అయితే ముష్పికర్ హ్యాండ్లింగ్ ది బాల్'రూల్ తో అవుటయ్యాడు. ముష్ఫికర్‌ రహీం ఒక్కడే 35 పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆలౌటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, ఫిలిప్స్ చెరో మూడు వికెట్లు, అజజ్ పటేల్ రెండు, సౌథి ఒక వికెట్ తీశారు.


అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసేసరికి అయిదు వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది.