Asia Cup 2025 Ban Gets 2nd Victory : తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ సత్తా చాటింది. మంగళవారం అబుధాబిలో ఆఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 8 పరుగులతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. దీంతో లీగ్ దశలో రెండు విజయాలు సాధించిన బంగ్లా.. సూపర్-4పై ఆశలు పెట్టుకుంది. అంతకుముందు టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ తంజిద్ హసన్ సూపర్బ్ ఫిఫ్టీ (31 బంతుల్లో 52, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఓ మాదిరి ఛేజింగ్ తో బరిలోకి దిగిన ఆఫ్గాన్.. ఓవర్లన్నీ ఆడి 146 పరుగులకే పరిమితమైంది. దీంతో 8 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (31 బంతుల్లో 35, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ విజయంతో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. సూపర్-4 దశకు చేరే జట్ల వివరాలు తెలియాలంటే శ్రీలంక, ఆఫ్గాన్ ల మధ్య జరిగే మ్యాచ్ వరకు ఆగక తప్పదు. ఈ మ్యాచ్ లో లంక గెలిస్తే, లంకతోపాటు బంగ్లా సూపర్-4కు చేరతాయి. ఒకవేళ ఆఫ్గాన్ గెలిచినా చాలు, లంకతోపాటు ఆ జట్టు కూడా తర్వాతి దశకు అర్హత సాధిస్తుంది. అయితే ఒడినా, భారీ తేడాతో మాత్రం లంక ఒడిపోకూడదు. ఎందుకంటే నెట్ రన్ రేట్ దిగజారితే, మూడో స్థానానికి ఆ జట్టు పడిపోయి, ఎలిమినేట్ అయ్యే అవకాశముంది. ఈ మ్యాచ్ గురువారం ఇదే వేదికపై జరుగుతుంది.
సూపర్ ఓపెనింగ్..
లంకతో గత మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిపోయిన బంగ్లా ఈ మ్యాచ్ లో సత్తా చాటింది. ముఖ్యంగా ఓపెనర్లు సైఫ్ హసన్ (30), తంజిద్ ఆకట్టుకున్నారు. వీరిద్దరూ ఆరంభం నుంచే ఆఫ్గాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేశారు. తొలి వికెట్ కు 63 పరుగులు జోడించిన తర్వాత హసన్ ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ లిటన్ దాస్ (9) కూడా త్వరగానే వెనుదిరిగినా, తౌహిద్ హృదయ్ (26) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని తంజిద్ ఔటయ్యాడు. అయితే చివర్లో కాస్త వేగంగా బంగ్లా బ్యాటర్లు ఆడలేక పోవడంతో అనుకున్నదాని కంటే కాస్త తక్కువ స్కోరుకే ఆ జట్టు పరిమితమైంది.
థ్రిల్లింగ్ విక్టరీ..
ఓ మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన ఆఫ్గాన్ కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ సాదికుల్లా అటల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇబ్రహీం జద్రాన్ (5) కూడా విఫలం కావడంతో ఆఫ్గాన్ ఒత్తిడిలో పడిపోయింది. అయినా కూడా గుర్బాజ్ కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అతనికి మిగతా వారి నుంచి సహాకారం దక్కలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుండటంతో గెలుపు దిశగా ఆఫ్గాన్ పయనించలేదు. చివర్లో అజ్మతుల్ల ఒమర్ జాయ్ (30), కెప్టెన్ రషీద్ ఖాన్ (20), నూర్ అహ్మద్ (14) బ్యాట్ ఝుళిపించి, ఆశలు రెకేత్తించినా, విన్నింగ్ లైన్ దాటడానికి సరిపోలేదు. దీంతో ఆఫ్గాన్ పరాజయం పాలు కాక తప్పలేదు. మిగతా బౌలర్లలో నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన బంగ్లా రన్ రేట్ మైనస్ లోనే ఉంది. దీంతో చివరి మ్యాచ్ లో లంకపై ఆఫ్గాన్ గెలిస్తే, బంగ్లా టోర్నీ నుంచి నాకౌట్ అవుతుంది.