Asia Cup 2025 Ind Next Match Latest Updates: డిఫెండింగ్ చాంపియన్ భారత్.. ఆసియాకప్ సూపర్-4లో ప్రవేశించిన ఏకైక జట్టుగా ఇప్పటివరకు నిలిచింది. ఇప్పటివరకు టోర్నీలో ఆడిన పాకిస్థాన్, యూఏఈపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూఏఈపై తొమ్మిది వికెట్లతో, పాక్ పై ఏడు వికెట్లతో గెలిచి, టోర్నీలో తమ డామినెన్స్ ను చాటింది. ఈక్రమంలో టోర్నీ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ను ఒమన్ తో ఈనెల 19న ఆడనుంది. ఈ క్రమంలో జట్టు ప్లేయింగ్ లెవన్ లో మార్పులు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ లోనూ కొన్ని మార్పులు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
బుమ్రాకి రెస్ట్..వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ముఖ్యమైన మ్యాచ్ ల్లో మాత్రమే భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒమన్ తో జరిగే మ్యాచ్ అంత అప్రధాన్యమైనది కావడంతో ఈ మ్యాచ్ లో తనుకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలా జరిగిన పక్షంలో అతని స్థానంలో ఫస్ట్ చాయిస్ పేసర్ గా అర్షదీప్ సింగ్ ఉంటాడనేది నిపుణలు అంచనా. ఇక ఈ మ్యాచ్ లో అర్షదీప్ ఆడితే, అరుదైన రికార్డును తను అందుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ ఫార్మాట్ లో 99 వికెట్లు తీసిన అర్షదీప్ మరో వికెట్ తీస్తే అంతర్జాతీయం వంద టీ20 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్ గా రికార్డులకెక్కుతాడు. ఈ నేపథ్యంలో తను ఒమన్ పై ఈ ఘనత సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు..!ఇక రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ అద్భుత విజయాలు సాధించి, టైటిల్ ఫేవరెట్ పేరుకు న్యాయం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ రెండు మ్యాచ్ ల్లో బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. అయితే సంజూ శాంసన్ స్థానంలో ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన శుభమాన్ గిల్ ఆకట్టుకోలేక పోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ తను త్వరగా ఔటయ్యాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశముంది. దీంతో ఓపెనర్ గా సంజూ బరిలోకి దిగే అవకాశముంది. అలాగే మరో బ్యాటర్ గా ఫినిషర్ రింకూ సింగ్ కు తుది జట్టులో ఆడే అవకాశముంది. అలాగే హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇచ్చి, హర్షిత్ రాణాను ఆడించే అవకాశాలను తోసిపుచ్చలేం. ఇక సూపర్-4 షెడ్యూల్లో భాగంగా ఈనెల 21, 24, 26లలో లీగ్ మ్యాచ్ లు ఆడనుంది. ఇందులో కనీసం రెండు గెలిచినట్లయితే, ఫైనల్ కు చేరే అవకాశముంది. ఫైనల్ ఈనెల 28న జరుగుతుంది. ఇదే జరిగితే వారం వ్యవధిలో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉండటంతో, ముందు జాగ్రత్తగా ఒమన్ తో మ్యాచ్ కు కొన్ని మార్పులు చేసే అవకాశముంది. ఇక ఆసియాకప్ ను రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలిచిన భారత్.. తొమ్మిదోసారి కూడా కప్పును సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.