BAN vs SL Asia Cup 2023: ఆసియా కప్‌ను శ్రీలంక విజయంతో ప్రారంభించింది. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక 39 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ మతీష పతిరానాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో (89: 122 బంతుల్లో, ఏడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక (62 నాటౌట్: 92 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు. సదీర సమరవిక్రమ (54: 77 బంతుల్లో, ఆరు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు. శ్రీలంక బౌలర్లలో మతీష పతిరానాకు నాలుగు వికెట్లు దక్కాయి. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
గెలిపించిన అసలంక, సమరవిక్రమ
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. స్కోరు బోర్డుపై 15 పరుగులు చేరేసరికి ఓపెనర్లు పతుం నిశ్శంక (14: 13 బంతుల్లో, ఒక ఫోర్), దిముత్ కరుణరత్నే (1: 3 బంతుల్లో) పెవిలియన్ బాట పట్టారు. వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (5: 21 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.
అయితే సదీర సమరవిక్రమ (54: 77 బంతుల్లో, ఆరు ఫోర్లు), చరిత్ అసలంక (62 నాటౌట్: 92 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. వీరు నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించి లంకను విజయం వైపు నడిపించారు. అర్థ సెంచరీ అనంతరం సదీర సమరవిక్రమ అవుటైనా, కెప్టెన్ దసున్ షనకతో (14 నాటౌట్: 21 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి అసలంక మ్యాచ్‌ను ముగించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్‌కు రెండు వికెట్లు దక్కాయి. టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ అస్లాం, మెహదీ హసన్ తలో వికెట్ పడగొట్టారు.
ఆఖర్లో కుప్పకూలిన బంగ్లా..
అంతకు ముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వారికి ప్రారంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు మహ్మద్ నయీమ్ (16: 23 బంతుల్లో, మూడు ఫోర్లు), తన్జీద్ హుస్సేన్ (0: 2 బంతుల్లో) దారుణంగా విఫలం అయ్యారు. రెండో ఓవర్లోనే తన్జీద్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి ఐపీఎల్ స్టార్ మతీష పతిరానా శ్రీలంకకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో మహ్మద్ నయీమ్ కూడా అవుటయ్యాడు. దీంతో 25 పరుగులకే బంగ్లా రెండు వికెట్లు కోల్పోయింది.
టూ డౌన్లో వచ్చిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (5: 11 బంతుల్లో, ఒక ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అప్పటికి జట్టు స్కోరు 36 పరుగులు మాత్రమే. ఆ తర్వాత నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్ (20: 41 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు.
అక్కడ నుంచి బంగ్లాదేశ్ వికెట్ల పతనం ప్రారంభం అయింది. ఒకానొక దశలు 127/4తో ఓ మోస్తరు స్కోరు సాధిస్తారనుకున్న బంగ్లా... తర్వాతి బ్యాటర్లు విఫలం కావడంతో 164 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 37 పరుగుల తేడాలోనే ఆఖరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. శ్రీలంక బౌలర్లలో మతీష పతిరానా అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహీష్ తీక్షణకు రెండు వికెట్లు దక్కాయి. ధనంజయ డి సిల్వ, దునిత్ వెల్లలాగే, దసున్ షనక తలో వికెట్ దక్కించుకున్నారు.