BAN vs AUS  Match highlights:   టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup 2024) సూపర్‌ ఎయిట్‌(Super-8) తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా(Aus) విజయంతో ప్రారంభించింది. బంగ్లాదేశ్‌(Ban)తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఆస్ట్రేలియా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 140 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 11 ఓవర్లకే రెండు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసిన దశలో వర్షం ముంచెత్తింది. అప్పటికే ఆస్ట్రేలియా విజయం దాదాపుగా ఖాయమైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌(DLS method) పద్ధతిలో కంగారులు 28 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు.

 

బంగ్లా బ్యాటర్ల కట్టడి

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా..బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. ఆరంభంలో పిచ్‌ బౌలర్లకు  అనుకూలించడంతో ఆస్ట్రేలియా బౌలర్లు బంగ్లా బ్యాటర్లను తిప్పలు పెట్టారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ మూడో బంతికో తంజీద్‌ హసన్‌ను బౌల్డ్‌ చేసిన స్టార్క్‌ వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరకుండానే బంగ్లా తొలి వికెట్‌ కోల్పోయింది.  ఆ తర్వాత వికెట్ల పతనం కాసేపు ఆగింది. ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌కు జతకలిసిన బంగ్లా కెప్టెన్‌ శాంటో కంగారు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.  బంగ్లా బ్యాటర్లు ఆచితూచి ఆడారు. రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించిన అనంతరం బంగ్లా రెండో వికెట్‌ కోల్పోయింది. 25 బంతుల్లో 16 పరుగులు చేసిన లిట్టన్‌ దాస్‌ను జంపా అవుట్‌ చేశాడు. దీంతో 58 పరుగుల వద్ద  బంగ్లా రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే రిషద్‌ హోసైన్‌ను అవుట్‌ చేసిన మ్యాక్స్‌వెల్‌... బంగ్లాను మరో దెబ్బ కొట్టాడు. నాలుగు బంతులు ఆడి రెండు పరుగులు చేసిన హొసైన్‌... జంపాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 





 

శాంటో-హృదయ్‌ పోరాడినా... 

84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లా కష్టాల్లో పడింది. అయితే శాంటో-హృదయ్‌ కాసేపు పోరాడారు. శాంటోతో పోలిస్తే హృదయ్‌ కాస్త ధాటిగా ఆడాడు. వీరిద్దరూ కలిసి బంగ్లా స్కోరును వంద పరుగులు దాటించారు. ఇక బంగ్లా స్కోరు 150 దాటడం ఖాయమని భావిస్తున్న వేళ వీరిద్దరూ వెంటవెంటనే అవుటయ్యారు. శాంటో 36 బంతుల్లో 41 పరుగులు చేసి అవుటవ్వగా... హృదయ్‌ 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో  40 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఆసిస్‌ బౌలర్లలో కమిన్స్‌ హ్యాట్రిక్‌ సాధించి చరిత్ర సృష్టించగా... ఆడమ్‌ జంపా కూడా రాణించాడు.

 

సునాయసంగానే...

141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం దక్కింది. డేవిడ్‌ వార్నర్‌-ట్రావిస్‌ హెడ్‌ తొలి వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 65 పరుగులు జోడించారు. ఆ తర్వాత ట్రావిస్‌ హెడ్‌ 21 బంతుల్లో 31 పరుగులు చేసి అవుటైనా డేవిడ్‌ వార్నర్‌ మాత్రం దూకుడు కొనసాగించాడు. కానీ మిచెల్‌ మార్ష్‌ ఆరు బంతులు ఆడి ఒకే పరుగు చేసి అవుటయ్యాడు. కానీ వార్నర్‌ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్‌ 6 బంతుల్లో 14 పరుగులు చేసి క్రీజులో ఉండగా సరిగ్గా 100 పరుగుల వద్ద వర్షం కురిసింది.  . వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కంగారులు 28 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు.