భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డేవిడ్‌ వార్నర్‌.. భీకర ఫామ్‌లో ఉన్నాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభం ఇస్తున్నాడు. వార్నర్‌ చెలరేగిపోతుండడంతో ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచుల్లో తడబడ్డ ఆస్ట్రేలియా ఇప్పుడు గాడిన పడి వరుస విజయాలు సాధిస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధ్వంసక‌ర ఓపెన‌ర్ వార్నర్ అరుదైన ఘ‌నత సాధించాడు. 

 

కోహ్లీని దాటిన వార్నర్‌

వ‌న్డే ప్రపంచ‌క‌ప్ చ‌రిత్రలో అత్యధిక ప‌రుగులు చేసిన నాలుగో ఆట‌గాడిగా వార్నర్‌ రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.  వార్నర్ ఇప్పటి వ‌ర‌కు 24 ప్రపంచ‌క‌ప్ ఇన్నింగ్స్‌ల్లో 1405 ప‌రుగులు చేశాడు. వార్నర్ 63.86 సగటుతో 102 స్ట్రైక్ రేట్‌తో 1,405 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో వార్నర్‌కు ఆరు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 31 ఇన్నింగ్స్‌ల్లో 1,384 ప‌రుగుల‌తో ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాడు. 

 

టాప్‌లో సచిన్‌

వ‌న్డే ప్రపంచ‌క‌ప్ చ‌రిత్రలో అత్యధిక ప‌రుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స‌చిన్ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌, కుమార సంగ‌క్కర‌ల తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. సచిన్ టెండూల్కర్‌  44 మ్యాచుల్లో  56.95 సగటుతో 2 వేల 278 పరుగులు చేశాడు. సచిన్‌కు ప్రపంచకప్‌లో  ఆరు సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రికీ పాంటింగ్‌.. 46 మ్యాచ్‌ల్లో 45.86 సగటుతో 17 వందల 43 పరుగులు చేశాడు. పాటింగ్‌కు వరల్డ్‌ కప్‌లో ఐదు సెంచరీలు, ఆరు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కుమార సంగక్కర 37 మ్యాచుల్లో ఐదు సెంచరీలు, ఏడు అర్ధశతకాలతో 15 వందల 32 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. విరాల్ కోహ్లి 31 మ్యాచ్‌ల్లో 55.36 సగటుతో మూడు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలతో 1,384 పరుగులు చేశాడు.

 

ఈ ప్రపంచ‌క‌ప్‌లో వార్నర్ 68.33 సగటుతో  112 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆరు మ్యాచుల్లో 413 ప‌రుగులు చేసి అత్యధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో టాప్‌-3లో కొన‌సాగుతున్నాడు. ఇక ధర్మశాల వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్ 65 బంతుల్లోనే 5 ఫోర్లు ఆరు సిక్సర్లతో 81 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. హెడ్, వార్నర్ జోడి 19.1 ఓవర్లలోనే 175  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్‌ అయింది. 389 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. విజయానికి కేవలం అయిదు పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఆగిపోయింది. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన పోరుగా ఈమ్యాచ్‌ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 388 పరుగులు చేయగా.. కివీస్ 383 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 771 పరుగులు చేశాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 32 సిక్సులు బాదాయి. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైన రెండో మ్యాచ్‌గా ఈ పోరు నిలిచింది.  2019 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 33 సిక్సర్లు నమోదవ్వగా... ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 32 సిక్సులు నమోదయ్యాయి.