భారత సంతతికి చెందిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ రచిన్‌ రవీంద్ర. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. గాయం కారణంగా కివీస్‌ సారధి కేన్స్‌ విలియమ్సన్‌  ప్రపంచకప్‌కు దూరం కావడంతో లభించిన అవకాశాన్ని రచిన్ రవీంద్ర రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసి న్యూజిలాండ్‌ కీలక బ్యాట్స్‌మెన్‌గా మారాడు. నెమ్మదిగా క్రీజులో స్థిరపడి ఆ తర్వాత విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే.. ఇంగ్లాండ్‌పై 123 పరుగులతో అజేయంగా నిలిచిన రచిన్.. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 388 పరుగుల లక్ష్య చేధనలో 89 బంతుల్లో 116 పరుగులు చేశాడు.  ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌‌లు ఆడిన రచిన్ 81.20 యావరేజ్‌తో 406 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

 

సచిన్‌ సరసన..

తన పేరులోనే సచిన్‌ను పెట్టుకున్న రచిన్‌ ఇప్పుడు ఆ క్రికెట్‌ గాడ్‌ నెలకొల్పిన రికార్డును తాను కూడా నెలకొల్పి అబ్బురపరిచాడు. 24 ఏళ్లలోపు ప్రపంచ కప్‌లో రెండు శతకాలు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా రచిన్‌ రవీంద్ర రికార్డు సృష్టించాడు. 1996 వరల్డ్ కప్‌లో సచిన్ టెండుల్కర్ ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు రచిన్ తాను ఆరాధించే దిగ్గజ క్రికెటర్ సరసన నిలిచాడు. మొత్తానికి తాను పెట్టుకున్న పేరుకు రచిన్‌ సార్థకత తెచ్చాడు.

 

రచిన్‌ మరో రికార్డు

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తరఫున వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రచిన్‌ రవీంద్ర మరో రికార్డు నెలకొల్పాడు. రచిన్‌ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 77 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీనికంటే ముందు కూడా ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు కూడా రచిన్‌ రవీంద్ర పేరిటే ఉంది. ఇదే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రచిన్‌ రవీంద్ర 82 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఇప్పుడు తన రికార్డును తనే బద్దలు కొట్టాడు.

రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు బెంగళూరుకు చెందిన వారు. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి. ఈయన 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి వెల్లింగ్టన్‌లో స్థిరపడ్డారు. రచిన్‌ రవీంద్ర న్యూజిలాండ్‌లోనే పుట్టిపెరిగారు. రచిన్‌ రవీంద్ర పేరు వెనక ఒక ఆసక్తికర విషయం దాగుంది. రచిన్‌ తండ్రికి క్రికెట్‌ అన్నా... సచిన్‌, రాహుల్‌ ద్రావిడ్‌ అన్న విపరీతమైన అభిమానం. వారిద్దరి పేర్లు కలిసి వచ్చేలా తన కొడుక్కి పేరు పెట్టుకున్నారు రవి కృష్ణమూర్తి. రాహుల్‌ పేరు నుంచి "రా" అనే అక్షరాన్ని.. సచిన్‌ పేరు నుంచి "చిన్‌" అనే అక్షరాలను తీసుకుని తన కుమారుడికి రచిన్‌ అని పేరు పెట్టారు. తన కొడుకుని ఈ దిగ్గజాల అంతటి క్రికెటర్ ను చేయాలని చిన్నప్పటి నుంచే రచిన్‌కు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించాడు. 

 

న్యూజిలాండ్ అండర్-19 జట్టులో రచిన్‌ రవీంద్ర తన అద్భుత ఆటతీరుతో వెలుగులోకి వచ్చాడు. 2016, 2018లో న్యూజిలాండ్‌ తరపున అండర్‌ 19 ప్రపంచకప్‌లో ఆడాడు. దేశవాళీ పోటీల్లో ఆల్‌రౌండర్‌గా పరుగుల వరద పారించి...వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2021లో బంగ్లాదేశ్‌పై తొలి టీ20 ఆడాడు. ఆరు టీ ట్వంటీలు ఆడిన తర్వాత 2021లోనే టీమిండియాతో జరిగిన మ్యాచులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. కానీ న్యూజిలాండ్‌ వన్డే జట్టులో రచిన్‌కు అంత తేలిగ్గా స్థానం దక్కలేదు. దేశవాళీ, టెస్టుల్లో నిలకడగా రాణిస్తుండడంతో రెండేళ్ల తర్వాత 2023 లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.