భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. కొన్ని జట్లు సెమీస్‌ చేరేందుకు మార్గం సుగమం చేసుకోగా... మరికొన్ని జట్లు నాకౌట్‌ చేరేందుకు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ ప్రపంచకప్‌లో పరుగుల వరద పారుతోంది. అగ్ర జట్లకు పసికూనలు షాక్‌ ఇస్తున్నాయి. ప్రపంచ కప్ 2023లో జరిగిన 28వ మ్యాచ్‌లో  నెదర్లాండ్స్‌ మరో సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో సెమీఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు పరాజయాల పరంపరను కొనసాగించిన బంగ్లాదేశ్‌ ఈ మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో డచ్‌ జట్టు విజయంతో ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో మార్పులు సంభవించాయి. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు నెదర్లాండ్స్ 6 మ్యాచ్‌లు ఆడగా  2 గెలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయిదు మ్యాచ్‌లు ఆడిన బ్రిటీష్‌ జట్టు ఒకే ఒక్క విజయం మాత్రమే సాధించి రెండు పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. షకీబ్ అల్ హసన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానంలో ఉంది. 6 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన బంగ్లాదేశ్ కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించింది. ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ ప్రయాణం దాదాపు ముగిసినట్లే.



 ఆస్ట్రేలియాపై ఓడినా న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోనే కొనసాగుతోంది. న్యూజిలాండ్ 6 మ్యాచ్‌ల్లో రెండు ఓటములతో 8 పాయింట్లతో ఉంది. కివీస్‌ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడం ఆ జట్టును ఆందోళనపరుస్తోంది. కానీ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుత పోరాటం కనబరిచింది. ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 6 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు మొదటి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 6 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల్లో.. అన్ని గెలిచి 10 పాయింట్లతో  రెండో స్థానంలో కొనసాగుతోంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధిస్తే రోహిత్‌ సేన మళ్లీ అగ్రస్థానంలోకి రానుంది.



 ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు షాక్‌ ఇచ్చిన డచ్‌ జట్టు... ఇప్పుడు బంగ్లాకు షాక్‌ ఇచ్చి తమ గెలుపు గాలివాటం కాదని నిరూపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన . కోల్‌కత్తా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 230 పరుగుల కష్ట సాధ్యం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కేవలం 42.2  ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. దీంతో నెదర్లాండ్స్‌ 87 పరుగుయా భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో నెదర్లాండ్స్‌  ఎనిమిదో స్థానానికి ఎగబాకగా... బంగ్లా తొమ్మిదో స్థానానికి దిగజారింది. 



 మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆసిస్‌ గెలుపొందింది. ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌లో.... ఆస్ట్రేలియా నిర్దేశించిన 389 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కివీస్‌ చివరి బంతి వరకూ పోరాడింది. భారీ లక్ష్యాన్ని చూసి ఏమాత్రం వెరవని న్యూజిలాండ్‌.. తమ జట్టు ఎందుకు ప్రత్యేకమో ఈ పోరాటంతో మరోసారి నిరూపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్‌ అయింది. 389 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. విజయానికి కేవలం అయిదు పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఆగిపోయింది. ఓడిపోయినా భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్‌ పోరాటం క్రికెట్‌ ప్రేమికుల హృదయాలను దోచుకుంది.