Cricket News: భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ సాధించాలనుకున్న ఆసీస్‌కు షాక్ తగిలింది. గాయంతో స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ మిగతా రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇప్పటికే వెన్ను నొప్పితో అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టుకు దూరమైన హేజిల్ వుడ్.. తాజాగా కాలి గాయంతో నాలుగు, ఐదు టెస్టులకు దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. నిజానికి మూడో టెస్టులో ఆడిన హేజిల్ వుడ్ కాలికి గాయం కావడంతో మ్యాచ్ మధ్యలోనే దాదాపుగా వైదొలిగాడు. ముందు జాగ్రత్తగా అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి, వివిధ పరీక్షలు నిర్వహించింది. 


రెండు వారాలు దూరం..
నిజానికి హేజిల్ వుడ్‌కు అయిన గాయం చిన్నదేనని స్కానింగ్‌లో తేలింది. అయితే రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఈ రెండు టెస్టులకు అతడిని జట్టులో నుంచి తప్పించింది. మరోవైపు కీలక సమయంలో గాయాలబారిన పడుతుండటంపై హేజిల్ వుడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. రెండో టెస్టులో అనుకోకుండా వెన్నునొప్పికి గురయ్యాయని, ప్రస్తుతం కాలి పిక్కకు గాయం అయిందని వెల్లడించాడు. అయితే వెన్నునొప్పి నుంచి కోలుకుని, తిరిగి జాతీయ జట్టుకు ఆడాలని తీవ్రంగా శ్రమించానని, అయితే ఇప్పుడిలా మళ్లీ జట్టుకు గాయం కారణంగా దూరం కావడం బాధకరంగా ఉందని ఉద్వేగానికి లోనయ్యాడు. 


Also Read: Kohli Vs Media: ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?


నాలుగేళ్లుగా సతమతం..
గత నాలుగేళ్లుగా గాయాల కారణంగా జట్టులోకి రావడం పోవడం జరుగుతోందని హేజిల్ వుడ్ ఆవేదన చెందుతున్నాడు. వెన్నునొప్పి, కాలి పిక్క గాయం లాంటి చిన్నగాయాలవుతున్నాయని, అయితే కీలక సమయంలో వీటి కారణంగా జట్టుకు దూరం కావాల్సి వస్తోందని పేర్కొన్నాడు. మరోవైపు ఫిట్ నెస్ పెంచుకునేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నా, లక్కు కలిసి రావడం లేదని, గాయాలపాలు కావడం మానడం లేదని వ్యాఖ్యానించాడు. కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడని 33 ఏళ్ల హేజిల్ వుడ్‌కు చాలా మంచి పేరుంది. నిజానికి బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో కేవలం ఆరు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసినప్పటికీ, సరైన లైన్ అండ్ లెంగ్త్ , కచ్చితత్వంతో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టి, వికెట్ సాధించాడు. అయితే ఆ తర్వాత కాసేపటికి కాలి పిక్క గాయంతో తను పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు బీజీటీ సిరీస్ రసపట్టులో ఉంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నాలుగో టెస్టు బాక్సింగ్ డే రోజున అంటే డిసెంబర్ 26న మెల్ బోర్న్‌లో జరుగుతుంది. ఇక గాయానికి గురైన హేజిల్ వుడ్ స్థానంలో పేసర్ స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. రెండోటెస్టులోనూ హేజిల్ వుడ్ స్థానంలో తను బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు.  

Also Read: ICC Champions Trophy: హైబ్రీడ్ మోడల్ - ఇకపై పాక్‌తో మ్యాచ్‌లకు భారత్‌కు ఆ ప్లస్ పాయింట్ ఉండబోదు, ఐసీసీ నిర్ణయంపై అభిమానుల ఆవేదన