AUS VS SA WTC Final 2nd Day Updates: ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా పట్టు బిగించింది. బౌలర్లకు అనువైన పిచ్ పై జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా గురువారం రెండోరోజు ఆటముగిసేసరికి ఓవరాల్ గా 218 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు రెండో రోజు ఓవర్ నైట్ స్కోరుతో ఆట మొదలు పెట్టిన సౌతాఫ్రికా పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో 95 పరుగులు మాత్రమే జత చేసి 57.1 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ కు కీలకమైన 74 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకుంది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ఆట ముగిసేసరికి 40 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసి, మ్యాచ్ శాసించే స్థితిలో నిలిచింది. క్రీజులో మిషెల్ స్టార్క్ (16), నాథన్ లయోన్ (1) బ్యాటింగ్ చేస్తున్నారు.
బవూమా-బెడింగ్ హామ్ కీలక భాగస్వామ్యం..
రెండోరోజు ఆటను సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. కెప్టెన్ టెంబ బవుమా (36), ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ డేవిడ్ బెడింగ్ హామ్ (111 బంతుల్లో 45, 6 ఫోర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన వీరిద్దరూ అడపాదడపా బ్యాట్ ఝళిపించారు. దీంతో ఐదో వికెట్ కు కీలకమైన 64 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఈక్రమంలో మ్యాచ్ లోనే ఏకైక సిక్సర్ ను బవూమా బాదాడు. అయితే జోరుగా వెళుతున్న ఈ భాగస్వామ్యాన్ని ఆసీస్ కెప్టెన్స్ పాట్ కమిన్స్ విడదీశాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు విఫలం కావడం, బెడింగ్ హామ్ కూడా ఫిఫ్టీ కి ముందు పెవిలియన్ కు వెళ్లడంతో 138 పరుగుల వద్ద ముగిసింది. బౌలర్లలో కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగాడు. స్టార్క్ కు రెండు వికెట్లు దక్కాయి. నిజానికి ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్ లో ఒక ఓవర్ ఎక్కువగా సఫారీలు ఆడినప్పటికీ, జిడ్డు బ్యాటింగ్ తో ఎక్కువ పరుగులు రాబట్టలేకపోయారు.
తడబడిన ఆసీస్ బ్యాటర్లు..
తొలి ఇన్నింగ్స్ దక్కిన హుషారు ఆసీస్ కు ఎంతో సేపు నిలవలేదు. టపటపా వికెట్లు కోల్పోవడంతో ఒక దశలో కనీసం వంద పరుగుల స్కోరైనా దక్కుతందా అనిపించింది. కానీ అలెక్స్ కేరీ (43), స్టార్క్ వేగంగా ఆడి కీలకమైన 61 పరుగులు జోడించడంతో ఆసీస్ మ్యాచ్ ని శాసించే స్థితికి చేరుకుంది. అంతకుమందు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (6), మార్నస్ లబుషేన్ (22) తొలి వికెట్ కు 28 పరుగులు జోడించారు. అయితే ఖవాజా ఔటయ్యాక వికెట్ల పతనం కొనసాగింది. కామెరాన్ గ్రీన్ డకౌట్, స్టీవ్ స్మిత్ (13), ట్రావిస్ హెడ్ (9), బ్యూ వెబ్ స్టర్ (9), కమిన్స్ (6) విఫలం కావడంతో ఒక దశలో 73/7 తో ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కేరీ-స్టార్క్ ద్వయం ఆదుకుంది. 14 ఓవర్లపాటు సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసి కీలక పరుగులు జోడించింది. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కేరీ వికెట్ తీసిన సఫారీలు ఊపిరి పీల్చుకున్నారు. బౌలర్లలో రబాడ, లుంగీ ఎంగిడికి మూడేసి వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో తొలి రోజు 14 వికెట్లు పడగా, రెండోరోజు కూడా 14 వికెట్లే పడటం విశేషం. ఏదైమైనా మూడో రోజే ఫలితం తేలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.