ఆస్ట్రేలియా(Australia) స్టార్ ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా(Usman Khawaja)కు ఐసీసీ(ICC) షాక్‌ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు  చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెర్త్‌(Perth) వేదికగా పాకిస్థాన్‌(Pakistan)తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఖవాజా.. భుజానికి నల్ల రిబ్బన్‌ ధరించి బ్యాటింగ్‌కు దిగాడు. పాల‌స్థీనా(Palestine)కు మ‌ద్దతుగా తాను అలా చేశాన‌ని ఖ‌వాజా చెప్పాడు. అయితే నిబంధనల ప్రకారం ఇది తప్పు కావడంతో ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ అనుమ‌తి తీసుకోకుండా ఖ‌వాజా న‌ల్ల రిబ్బన్ ధ‌రించ‌డాన్ని ఐసీసీ త‌ప్పుబ‌ట్టింది. ఐసీసీ నిబంధనలను ఖవాజా ఉల్లంఘించాడని... దుస్తులు, వస్తువులకు సంబంధించిన నిబంధననను అతిక్రమించాడని ఐసీసీ వెల్లడించింది. అతడిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఇప్పటికే ఖవాజా త‌న త‌ప్పును అంగీక‌రించి.. మ‌రోసారి అలా చేయ‌న‌ని చెప్పాడని ఐసీసీ తెలిపింది.  ఐసీసీ నిబంధ‌న‌ల ప్రకారం అనుమ‌తి లేకుండా ఆట‌గాళ్లు ఏదైనా మెసేజ్‌ను జెర్సీలు, బ్యాటుపై లేదా షూ, రిబ్బన్ బ్యాండ్‌ల ద్వారా ప్రద‌ర్శించ‌డం నేరం. పాక్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ఖ‌వాజా తొలి ఇన్నింగ్స్‌లో 41, రెండో ఇన్నింగ్స్‌లో 90 ప‌రుగుల‌తో అద్భుతంగా రాణించాడు. 
 


పాకిస్థాన్‌ ఘోర పరాజయంతో ప్రారంభం


ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్థాన్‌ ఘోర పరాజయంతో ప్రారంభించింది. మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 233 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసిన ఆసీస్‌.. పాకిస్తాన్‌ ఎదుట 449 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. 450 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌ 89 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌట్‌ కాగా.. పాక్‌ కేవలం 271 పరుగులకే పరిమితమైంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి డిక్లేర్‌ చేసి 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌.. ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్‌ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది.


చెలరేగిన డేవిడ్ వార్నర్


తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ చెలరేగిపోయాడు. పాకిస్థాన్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ తొలి రోజే భారీ సెంచరీ బాదేశాడు. వార్నర్‌ విధ్వంసంతో తొలి టెస్ట్‌లో తొలిరోజు పాక్‌పై కంగారులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. పాక్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వార్నర్‌... వన్డే తరహా ఆటతీరుతో చెలరేగిపోయాడు. 211 బంతుల్లో 16 ఫోర్లు, నాలుగు సిక్సులతో 164 పరుగులు చేసి తాను ఎంతటి విలువైన ఆటగాడినో క్రికెట్‌ ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాడు. వార్నర్‌ భారీ శతకంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసింది. పాక్‌ అరంగేట్రం బౌలర్‌ ఆమిర్‌ జమాల్‌ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు చేసింది. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ 62 పరుగులతో రాణించాడు. ఆసిస్‌ బౌలర్లలో నాథన్‌ లియోన్‌ 3, స్టార్క్‌, కమిన్స్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.