సఫారీ గడ్డపై టీమిండియా(Team Indina) చరిత్ర సృష్టించింది. 2018 తర్వాత దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపై వన్డే సిరీస్ గెలిచి రికార్డు సృష్టించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే(Third ODI)లో ఘన విజయంతో భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ ద్వారా యువ క్రికెటర్ రజత్ పాటిదార్(Rajat Patidar) టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ (Ruthuraj Gaikwad) స్థానంలో బరిలోకి దిగిన పాటిదార్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) చేతుల మీదుగా పాటిదార్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్(Sai Sudarshan)తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన పాటిదార్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఉన్నంతవరకూ ధాటిగా బ్యాటింగ్ చేసిన రజత్ పాటిదార్ 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సుతో 22 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టడం ద్వారా రజత్ పాటిదార్ ఐపీఎల్(IPL2024) వేతనం పెరగనుంది.
అరకోటి అందుకున్న పాటిదార్
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) తరఫున ఆడుతున్న పాటిదార్ ఇప్పటి వరకూ ఏడాదికి రూ.20 లక్షలు తీసుకుంటున్నాడు. ఇది ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు ఇచ్చే బేస్ ప్రైజ్. ఐపీఎల్ సీజన్ల మధ్యలో భారత జట్టుకు ఆడిన క్రికెటర్లకు కనీసం రూ.50 లక్షలు ఇవ్వాలని బీసీసీఐ (BCCI) నియమం పెట్టింది. అందులో భాగంగానే పాటిదార్‌కు 17వ సీజన్‌తో అరకోటి అందుకోనున్నాడు. ఇప్పటివరకూ పాటిదార్‌కు ఆర్సీబీ(RCB) రూ.20 లక్షలు ఇస్తూ వస్తోంది. బీసీసీఐ నిబంధన ప్రకారం మూడో వన్డేలో ఆరంగేట్రం చేసిన రజత్ పాటిదార్ క్యాప్డ్ ప్లేయర్‌గా మారడంతో బెంగళూరు 17వ సీజన్‌లో మరో రూ.30 లక్షలు కలిపి మొత్తంగా రూ.50 లక్షలు ఇవ్వనుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ 5-9 మ్యాచ్‌లు టీమిండియా తరఫున ఆడితే రూ.75 లక్షలు, 10 మ్యాచ్‌లు ఆడితే కోటి రూపాయల చొప్పున అతడి ఐపీఎల్ శాలరీ పెరుగుతుంది. ఈ మేరకు అతడు ఆడే ఫ్రాంచైజీ వేతనాన్ని పెంచాల్సి ఉంటుంది. రజత్ పాటిదార్ ఇప్పుడు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి.. ఆర్సీబీ 2024 సీజన్లో అతడికి రూ.20 లక్షలకు బదులు రూ.50 లక్షలు చెల్లించాలి. అతడు ఐపీఎల్‌లోపు భారత్ తరఫున పది మ్యాచ్‌లు ఆడగలిగితే అతడి ఐపీఎల్ వేతనం రూ.20 లక్షల నుంచి కోటి రూపాయలకు చేరుకుంటుంది.
టీ20లలోనూ మెరుగైన రికార్డు
దేశవాళీ క్రికెట్‌లో గత ఎనిమిదేళ్లుగా రాణిస్తున్న రజత్ పాటిదార్.. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇప్పటి వరకు మొత్తంగా 57 మ్యాచ్‌లు ఆడి రెండు వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. టీ20లలోనూ అతడికి మెరుగైన రికార్డు ఉంది. మధ్యప్రదేశ్ తరఫున 148.55 స్ట్రైక్‌రేటుతో 1640 పరుగులు సాధించాడు. పొట్టి క్రికెట్‌లో అదరగొడుతున్న పాటిదార్‌ను ఐపీఎల్ వేలం-2021 సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో పాటిదార్ క్వాలిఫయర్ 1లో వేగవంతమైన సెంచరీ బాదాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచుల్లో అతడు 55.50 సగుటుతో 333 రన్స్ కొట్టాడు. 16వ సీజన్‌కు ముందు గాయపడిన పాటిదార్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మధ్యే గాయం నుంచి కోలుకున్న పాటిదార్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.
ఇప్పటి వరకు మొత్తంగా ఆర్సీబీ తరఫున 12 మ్యాచ్‌లు ఆడిన రజత్ పాటిదార్ 404 పరుగులు సాధించాడు. తాజాగా టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చిన పాటిదార్.. ఐపీఎల్2024లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్-2024లో చోటే లక్ష్యంగా ముందుకు సాగనున్నాడు.