AUS vs NZ, Super 12 Match: క్యాచులే మ్యాచులు గెలిపిస్తాయి! చక్కని ఫీల్డింగ్‌ బ్యాటింగ్‌ జట్టుపై ఒత్తిడి పెంచుతుంది! ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12 తొలి మ్యాచులో ఇదే జరిగింది. గతేడాది రన్నరప్‌ న్యూజిలాండ్‌ అద్భుతమైన ఫీల్డింగ్‌తో అలరించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంది. 11 ఏళ్ల తర్వాత ఆతిథ్య జట్టును ఓడించి విజయ దుందుభి మోగించింది. అలాంటిలాంటి ఓటమి కాదిది! పదో, ఇరవయ్యో కాదు! ఏకంగా 89 పరుగుల తేడా! 201 ఛేదనకు దిగిన ఫేవరెట్‌ ఆసీస్‌ను 17.1 ఓవర్లకే 111కే కివీస్‌ కుప్పకూల్చింది.


ఊహించని ఆటతీరు!


సొంతదేశం.. సొంత పిచ్‌.. భీకరమైన బ్యాటర్లు ఉండటంతో ఆసీస్‌ 201 ఛేదనలో రాణిస్తుందని అంతా ఆశించారు! గెలిచినా ఆశ్చర్యం లేదని అనుకున్నారు. కానీ కివీస్‌ వారి ఆశలను అడియాసలు చేసింది. చక్కని బౌలింగ్‌ అంతకు మించి అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆతిథ్య జట్టును ఓడించింది. టిమ్‌ సౌథీ (3/6), మిచెల్‌ శాంట్నర్‌ (3/31), ట్రెంట్‌ బౌల్ట్‌ (2/24) ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టారు. జట్టు స్కోరు 5 వద్దే డేవిడ్‌ వార్నర్‌ (5) విచిత్రంగా ఔటయ్యాడు. సౌథీ వేసిన బంతి అతడి బ్యాటు అంచుకు తగిలి వికెట్లను గిరాటేసింది.


మరికాసేపటికే ఆరోన్‌ ఫించ్‌ (13) షాటు ఆడుతూ విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మరో 4 పరుగులకే మిచెల్‌ మార్ష్‌ (16) ఇచ్చిన క్యాచ్‌ను నీషమ్‌ ఒడిసిపట్టాడు. శాంట్న్‌ర్‌ బౌలింగ్‌లో స్టాయినిస్‌ (7) క్యాచ్‌ను గ్లెన్‌ ఫిలిప్స్‌ అందుకున్న తీరు హైలైట్‌. దూరం నుంచి పరుగెత్తుతూ గాల్లోకి ఎగిరి మరీ ఒడిసిపట్టాడు. అప్పటికి ఆసీస్‌ స్కోరు 50. ఈ క్రమంలో మాక్స్‌వెల్‌ ఒంటరి పోరాటం చేసినా మరోవైపు వరుసగా వికెట్ల పతనం ఆగలేదు. 14వ ఓవర్లో అతడిని శాంట్నర్‌ ఔట్‌ చేయడంతో ఆసీస్‌ కథ ముగిసింది. ఆఖర్లో కమిన్స్‌ (21) ఎదురుదాడి చేయబోయినా అప్పటికీ రన్‌రేట్‌ చేతులు దాటిపోయింది. ఆతిథ్య జట్టు 111కు ఆలౌటైంది.


అలెన్‌ మొదలెట్టాడు!


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కింది! క్రీజులోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ దంచికొట్టుడు మొదలుపెట్టాడు. ఓవర్‌కాస్ట్‌ కండీషన్స్‌ను అస్సలు పట్టించుకోలేదు. హేజిల్‌వుడ్‌ను మినహాయించి ఆడిన ప్రతి బౌలర్‌ను చితకబాదేశాడు. కేవలం 16 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. ప్రమాదకరంగా మారిని అతడిని జట్టు స్కోరు 56 వద్ద హేజిల్‌వుడ్‌ బౌల్డ్‌ చేశాడు.


కాన్వే ముగించాడు!


మరోవైపు కాన్వే నిలకడగా ఆడటంతో పవర్‌ ప్లే ముగిసే సరికి కివీస్‌ 65/1తో నిలిచింది. కేన్‌ విలియమ్సన్‌ (23) బంతికో పరుగు చొప్పున చేశాడు. అతడిని ఆడమ్‌ జంపా ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 125. గ్లెన్‌ ఫిలిప్స్‌ (12) సైతం ఎక్కువ సేపు క్రీజులో ఉండలేదు. మరోవైపు కాన్వే విలువైన షాట్లు ఆడుతూ 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ఆఖర్లో జిమ్మీ నీషమ్‌ (26*; 13 బంతుల్లో 2x6)తో కలిసి చితకబాదాడు. నాలుగో వికెట్‌కు 24 బంతుల్లో 48 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరును 200/3కు చేర్చాడు.