Steve Smith records most hundreds against India in Tests | మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అద్భుత శతకం సాధించాడు. తనకు తిరుగులేని రికార్డు ఉన్న మెల్‌బోర్న్ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారించాడు. 167 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి వేసి ఇన్నింగ్స్ 101వ ఓవర్లో చివరి బంతిని మిడాఫ్, ఎక్స్‌ట్రా కవర్ మధ్యలో బౌండరీకి తరలించడంతో స్టీవ్ స్మిత్ శతకం పూర్తయింది. కాగా, టెస్టు కెరీర్‌లో అతడికిది 34వ సెంచరీ. 
శతక భాగస్వామ్యం
ఓవర్ నైట్ స్కోర్ 311/6 తో రెండో ఆట ప్రారంభించారు స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్. ఎక్కడా తడబాటు లేకుండా వీరిద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈజీగా బౌండరీలు సాధిస్తూ మెరుగైన రన్ రేట్‌తో నేటి తొలి సెషన్‌లో స్మిత్, కమిన్స్ బ్యాటింగ్ కొనసాగించారు. మొదట స్టీవ్ స్మిత్ శతకం పూర్తి చేసుకోగా, అనంతరం కొద్దిసేపటికే వీరి భాగస్వామ్యం 100 దాటింది. 299 పరుగుల వద్ద 6వ వికెట్ రూపంలో కీపర్ అలెక్స్ కేరీ ఔట్ కాగా.. 7వ వికెట్‌కు ఇప్పటికే వీరు శతక భాగస్వామ్యం నెలకొల్పి ఆతిథ్య ఆస్ట్రేలియా స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 






స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భాగంగా జరుగుతున్న టెస్ట్ సిరీస్ 4వ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. తాజా శతకంతో టెస్టుల్లో భారత్‌పై అత్యధిక శతకాలు నమోదు చేసిన క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ నిలిచాడు. ఈ టెస్టుకు ముందు వరకు ఇంగ్లాండ్ కు చెందిన జో రూట్‌తో కలిసి 10 టెస్టు శతకాలతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు స్మిత్. బాక్సింగ్ డే టెస్టు రెండో రోజున చేసిన శతకంతో భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా స్టీవ్ స్మిత్ నిలిచాడు. భారత్ మీద చేసిన 192 పరుగులు మెలో‌బోర్న్ స్టేడియంలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు. తాజా శతకంతో 34 టెస్టు సెంచరీలు చేసిన సునీల్ గవాస్కర్, మహేళ జయవర్దనే, బ్రియాన్ లారా, యూనిస్ ఖాన్‌ల సరసన చేరాడు.



కమిన్స్ హాఫ్ సెంచరీ మిస్
కెప్టెన్ పాట్ కమిన్స్ హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఏ ఇబ్బంది లేకుండా భారత పేసర్లు జస్పిత్ బుమ్రా, ఆకాష్ దీప్ లను ఎదుర్కొన్నాడు కమిన్స్. ఆకాష్ దీప్ వేసిన ఓ ఓవర్లో స్మిత్ ఓ బౌండరీ కొట్టగా, కమిన్స్ సైతం రెండు ఫోర్లు కొట్టాడు. 63 బంతుల్లో 49 పరుగులు చేసిన కమిన్స్ జడేజా బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ పట్టడంతో 7వ వికెట్‌గా కమిన్స్ వెనుదిరిగాడు. 108 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 432 పరుగులు చేసింది.


Also Read: Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు