Asian Games: 


భారత మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. ఆసియా క్రీడల్లో టీ20 ఫైనల్‌కు దూసుకెళ్లింది. కనీసం రజతం ఖాయం చేసుకుంది. హాంగ్జౌ వేదికగా జరిగిన సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. పూజా వస్త్రాకర్‌ (4/17) దెబ్బకు మొదట బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి 51 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఆ తర్వాత టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో 70 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. శ్రీలంక, పాకిస్థాన్‌ తలపడుతున్న రెండో సెమీస్‌లో విజేతతో ఫైనల్‌ ఆడనుంది.


పూజ మాయ!


టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌ను మొదట బ్యాటింగ్‌కు పంపించింది. మీడియం పేసర్‌, బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసే పూజా వస్త్రాకర్‌ (Pooja Vastrakar) బంతి అందుకున్న క్షణం నుంచి చెలరేగింది. కట్టుదిట్టంగా బంతులేస్తూ ప్రత్యర్థిని వణికించింది. పరుగుల ఖాతా తెరవకముందే, ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ సాఠి రాణి (0)ను పెవిలియన్‌కు పంపించింది. ఐదో బంతికి మరో ఓపెనర్‌ షమిమా సుల్తానా (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. వన్‌డౌన్‌లో వచ్చిన శోభనా మోసత్రీ (8)ని జట్టు స్కోరు 18 వద్ద ఔట్‌ చేసింది. ఆ తర్వాత షోర్నా అక్తర్‌ (8)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసింది. టాప్‌ స్కోరర్‌ (12) రనౌట్‌ అయింది. మరికాసేపటికే ఫాహిమా ఖాటూన్‌ (8) రనౌట్‌గానే వెనుదిరిగింది. బంగ్లాలో ఐదుగురు డకౌట్‌ అవ్వగా మరో ఐదుగురు సింగిల్‌ డిజిట్‌కు పరిమితం అయ్యారు. టిటాస్‌ సాధు, అనమ్‌జోత్‌ కౌర్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌, దేవికా వైద్య తలో వికెట్‌ పడగొట్టారు.


ఫినిష్‌ చేసిన జెమీమా


స్వల్ప ఛేదనకు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ స్మృతి మంధాన (7) జట్టు స్కోరు 19 వద్ద ఔటైంది. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ (17; 21 బంతుల్లో 2x4)తో కలిసి జెమీమా రోడ్రిగ్స్‌ (20*; 15 బంతుల్లో 3x4) పని పూర్తి చేసింది. సొగసైన మూడు బౌండరీలు బాదేసింది. బంగ్లాకు అనవసరంగా ఎడ్జ్‌ ఇవ్వొద్దన్న ఉద్దేశంతో దూకుడు పెంచింది. జట్టు స్కోరు 40 వద్ద షెఫాలీ ఔటైనా కనిక అహుజ (1)తో  కలిసి జెమీమా విజయం అందించింది. సోమవారం ఫైనల్‌ జరుగుతుంది. ఒకవేళ పాకిస్థాన్‌ ఈ పోటీకి ఎంపికైతే అభిమానులకు పండగే అవుతుంది.