Asia Cup 2023, SL Vs AFG: ఆసియా కప్‌లో నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. ఇటీవలి కాలంలో వన్డేలలో అద్భుతాలు చేస్తున్న అఫ్గానిస్తాన్ ఆసియా కప్‌లో సూపర్ - 4 లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటే  నేడు శ్రీలంకతో జరుగబోయే కీలక మ్యాచ్‌లో  గెలవాల్సిందే. మాములుగా గెలిస్తే కూడా ఆ జట్టు సూపర్ - 4 చేరదు.  భారీ  విజయం సాధిస్తేనే   ముందడుగు వేస్తుంది. మరోవైపు లంకకూ ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యవసరం. తేడా కొడితే  టోర్నీ నుంచి  ఎలిమినేట్ అయ్యే  గండం  ఆ జట్టుకూ ఉంది. 


అఫ్గాన్ ఎలా గెలవాలంటే..?


రెండ్రోజుల క్రితం  లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా  బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో  ఓడిన అఫ్గానిస్తాన్‌కు  నేడు లంకతో జరుగబోయే మ్యాచ్ అత్యంత కీలకం.  గ్రూప్ - బి పాయింట్ల పట్టికలో  శ్రీలంక ఒక్క మ్యాచ్ ఆడి   గెలిచి  రెండు పాయింట్లతో  టాప్ పొజిషన్‌లో ఉంది.  బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో ఓడి మరోదాంట్లో గెలిచి  రెండు పాయింట్లతో లంకతో సమానంగా ఉంది.  కానీ అఫ్గాన్  ఒక్క మ్యాచ్ ఆడి  అందులో ఓడింది.   ఈ మ్యాచ్ ‌లో గెలిచినా అఫ్గాన్ ఖాతాలో రెండు పాయింట్లే చేరతాయి.  


నెట్ రన్ రేట్ విషయంలో అఫ్గాన్ (-1.780) పరిస్థితి మిగిలిన జట్లతో పోలిస్తే దారుణంగా ఉంది. శ్రీలంక (+0.951), బంగ్లాదేశ్ (+0.373)లు మెరుగ్గానే ఉన్నాయి.  నేటి మ్యాచ్‌లో అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ చేస్తే కనీసం  275 పరుగులు చేసి  ఆ తర్వాత లంకపై 70 పరుగుల తేడాతో గెలవాలి. అలా కాకుండా తొలుత  బౌలింగ్ చేస్తే లంక విధించే ఎంత టార్గెట్‌ను అయినా  35 ఓవర్లలోనే ఛేదించాలి. అప్పుడు  అఫ్గాన్ జట్టు నెట్ రన్ రేట్ మెరుగవుతుంది. అయితే లంకకు ఈ లెక్కలన్నీ అవసరం లేదు గానీ  సూపర్ - 4 రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాలి.  ఓడితే భారీ తేడా లేకుండా చూసుకున్నా ఆ జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు.  


బలాబలాలు.. 


అఫ్గాన్  బ్యాటింగ్  ఆశించిన స్థాయిలో లేదన్నది తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది.  బంగ్లాదేశ్‌తో మ్యచ్‌లో ఆ జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన క్రమంలో  అఫ్గాన్ భారీ ఆశలు పెట్టుకున్న రహ్మనుల్లా గుర్బాజ్ విఫలమయ్యాడు. ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది రాణించినా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. అయితే లంక బౌలర్ల గురించి గుర్బాజ్‌కు పూర్తి అవగాహన ఉంది. లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో అతడు   లంక బౌలర్లను ఎదుర్కున్నవాడే.  అఫ్గాన్ భారీ విజయం ఆశిస్తున్న నేపథ్యంలో  ఆ జట్టు బ్యాటింగ్ విభాగం కచ్చితంగా జూలు విదిల్చాల్చిందే.   ఇబ్రహీం,  హష్మతుల్లా తో పాటు  నజీబుల్లా, మహ్మద్ నబీ, రెహ్మత్ షా ఏ మేరకు  రాణిస్తారనేది ఆసక్తికరం.  బౌలింగ్‌లో   బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో  ఆ జట్టు నాసిరకంగా ఉందని చెప్పకతప్పదు.   పేసర్ ఫరూఖీతో సహా   గుల్బాదిన్ నబీ  భారీ పరుగులిచ్చాడు. స్పిన్నర్ల త్రయం రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్,  మహ్మద్ నబీలు ఏమాత్రం ప్రభావం చూపలేదు. 


మార్పుల్లేకుండానే లంక.. 


ఈ మ్యాచ్‌లో పెద్దగా మార్పులు ఏమీ చేసే అవకాశం కనిపించడం లేదు.  బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు  బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ ‌లో కూడా రాణించింది. ఫస్ట్ ఛాయిస్ బౌలర్లు లేకున్నా కసున్ రజిత,  తీక్షణ, మతీషా పతిరాన వంటి యువబౌలర్లతోనే  శనక  మంచి ఫలితాలు  రాబట్టాడు.   ఇక బ్యాటింగ్‌లో ఆ జట్టు కాస్త తడబడినా   మ్యాచ్ జరిగే లాహోర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేదే కావున  పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, కరుణరత్నె‌లు రాణిస్తారని లంక ఆశలు పెట్టుకుంది.  మిడిలార్డర్‌లో  సమరవిక్రమ, చరిత్ అసలంక,  ధనంజయతో పాటు కెప్టెన్ శనకలతో ఆ జట్టు పటిష్టంగానే ఉంది.  


పిచ్ : లాహోర్ లోని గడాఫీ స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామం.  ఇదే వేదికలో రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 334 పరుగులు చేసింది.   అయితే  రెండో సారి బ్యాటింగ్ చేసే జట్టు మాత్రం  మంచుతో ఇబ్బంది పడక తప్పదు.  అదీగాక లాహోర్ వేడికి  50 ఓవర్లు ఫీల్డింగ్ చేసి తర్వాత బ్యాటింగ్ చేయడం  కూడా కష్టమేనని మొన్న  మ్యాచ్ ముగిశాక  బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ చెప్పాడు. దీనిని దృష్టిలో ఉంచుకుని  నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచే సారథి  మొదట బ్యాటింగ్‌కే మొగ్గు చూపొచ్చు.  


తుది జట్లు (అంచనా): 


శ్రీలంక : దిముత్ కరుణరత్నె, పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, దసున్ శనక, దుషన్ హేమంత, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరాన


అఫ్గానిస్తాన్ : రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్,  మహ్మద్ నబీ, గుల్బాదిన్ నయిబ్, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ ఫరూఖీ


మ్యాచ్ వెన్యూ, టైమింగ్స్.. 


- లాహోర్ ‌లోని గడాఫీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం  3 గంటలకు   ప్రారంభం. 


లైవ్ చూడటమిలా.. 


- ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో స్టార్ నెట్వర్క్స్‌తో పాటు  మొబైల్స్‌లో అయితే డిస్నీ హాట్ స్టార్‌లలో ఉచితంగా చూడొచ్చు.

























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial