Asia Cup 2023: ఆసియా కప్ - 2023లో భాగంగా రెండ్రోజుల క్రితం భారత్ - పాకిస్తాన్ మధ్య శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా అర్థాంతరంగా రద్దైంది. ఇక నేడు నేపాల్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్ కూడా సజావుగా సాగే అవకాశాలైతే లేవు. సోమవారం క్యాండీలో వర్షం కురిసే అవకాశాలు 80 శాతం కంటే ఎక్కువున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో ఇప్పుడు వానాకాలం అని తెలిసి కూడా కీలక మ్యాచ్‌లు అక్కడ నిర్వహించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజమ్ సేథీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
భారత్ - పాక్ మ్యాచ్ వర్షార్పణమైన నేపథ్యంలో సేథీ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. లంకలో వాతావరణాన్ని ముందే అంచనా వేసిన సేథీ.. ఈ టోర్నీని లంకలో నిర్వహించడం దండగ అని తాను ముందే వారించానని, యూఏఈలో అయితే బెటర్ అని చెప్పినా తన మాటను ఎవరూ ఖాతరు చేయాలేదని తెలిపాడు.
‘ప్రపంచంలోనే గొప్ప క్రికెట్ సమరాల్లో ఒకటి అయిన మ్యాచ్ వర్షం కారణంగా అర్థాంతరంగా రద్దు అయింది. కానీ ఇది ముందే ఊహించింది. పీసీబీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించవద్దని ఏసీసీని కోరాను. యూఏఈలో అయితే బెటర్ అని వారి (ఏసీసీతో)తో వారించాను. కానీ వాళ్లు దానికి విచిత్రమైన సాకులు చెప్పారు. సెప్టెంబర్‌లో యూఏఈలో వేడి ఎక్కువగా ఉంటుందని టోర్నీని లంకకు షిఫ్ట్ చేశారు. కానీ ఆసియా కప్ - 2022 కూడా ఆగస్టు - సెప్టెంబర్‌లోనే జరిగింది. అప్పుడు కూడా వేడి ఉంది కదా. 2014 ఏప్రిల్‌లో, 2020 సెప్టెంబర్‌లో ఐపీఎల్‌ను యూఏఈలోనే నిర్వహించారు. క్రీడల్లోకి రాజకీయ జోక్యం తగదు. ఇది క్షమించరానిది..’ అని ట్వీట్ చేశాడు.
దాయాదుల సమరం వర్షార్పణమైన నేపథ్యంలో సేథీ అభిప్రాయాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. వాస్తవానికి పాకిస్తాన్‌తో పాటు యూఏఈలో ఆసియా కప్‌ను నిర్వహించాలని పీసీబీ కోరినా ఏసీసీ దానికి అంగీకరించలేదు. పాకిస్తాన్ వెళ్లేందుకు భారత్ అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో టోర్నీని పాక్‌తో పాటు లంకలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. దీనికి ఏసీసీ సభ్య దేశాలు కూడా సమ్మతి తెలిపాయి. కానీ ప్రస్తుతం లంకలో పరిస్థితులు చూశాక మాత్రం అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శ్రీలంకలో క్యాండీతో పాటు కొలంబోలలో కూడా మ్యాచ్‌ల నిర్వహణ సాగనుంది. సూపర్ - 4 మ్యాచ్‌లు కొలంబోలోనే జరుగుతాయి. అయితే పల్లెకెలెతో పాటు కొలంబోలో కూడా వర్షాలు దంచికొడుతున్న నేపథ్యంలో ఆసియా కప్ నిర్వాహకులు టోర్నీని కొలంబో నుంచి షిఫ్ట్ చేస్తారా..? అన్న పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial