Asia Cup 2023: 


ఆసియా కప్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌కు చోటివ్వడం మంచిదేనని టీమ్‌ఇండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. అతడిని ఎంపిక చేయడం వల్ల జట్టుకు రెండు ప్రయోజనాలు కలుగుతాయన్నాడు. లోయర్‌ ఆర్డర్లో అతడు పరుగులు చేస్తాడని పేర్కొన్నాడు. అందుకే యుజ్వేంద్ర చాహల్‌ను కాదని సెలక్టర్లు అతడికి ఓటేశారని తెలిపాడు. సంజూ శాంసన్‌ వల్ల టీమ్‌ఇండియాకు వైవిధ్యం దొరుకుతుందని వివరించాడు. ఆసియాకప్‌కు జట్టును ఎంపిక చేశాక గావస్కర్‌ మాట్లాడాడు.


'మరిన్ని పరుగులు చేస్తే సంజూ శాంసన్‌ కచ్చితంగా జట్టులో ఉంటాడు. యుజ్వేంద్ర చాహల్‌ విషయంలోనూ అంతే! కానీ కొన్నిసార్లు జట్టు సమతూకాన్ని చూసుకోవాలి. లోయర్‌ ఆర్డర్లో కుల్‌దీప్‌ యాదవ్‌ పరుగులు చేస్తున్నాడని సెలక్టర్లు భావించొచ్చు. అందుకే యూజీని కాదని అతడిని తీసుకొని ఉంటారు. పైగా లెఫ్ట్‌ హ్యాండ్‌ వైవిధ్యాన్ని తీసుకొస్తాడు' అని సన్నీ గావస్కర్‌ అన్నాడు.


వికెట్‌ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో సంజూ శాంసన్‌ వైవిధ్యం టీమ్‌ఇండియాకు అవసరమని గావస్కర్‌ అంటున్నాడు. సుదీర్ఘ కాలం అతడు జట్టుకు సేవలు అందిస్తాడని అంచనా వేశాడు. 'ప్రస్తుతం సంజూ శాంసన్‌ వయసు 28 ఏళ్లు. అలాంటప్పుడు అతడికిదే చివరి ప్రపంచకప్‌ అని చెప్పలేం. టీమ్‌ఇండియాలోకి రావడానికి అతడికి ఇంకా చాలా సమయం ఉంది' అని సన్నీ తెలిపాడు.


హైదరాబాద్‌ యువ కెరటం తిలక్‌ వర్మపై సన్నీ ప్రశంసలు కురిపించాడు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని పొగిడాడు. సెలక్టర్లు సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారని వివరించాడు. 'తిలక్‌ వర్మ ఎంపిక మంచి నిర్ణయమే. ఆడిన ప్రతి మ్యాచులో అతడు  అదర గొట్టాడు. తన సామర్థ్యాన్ని చాటాడు. ఐర్లాండ్‌పై వైఫల్యాలు ఉన్నాయి. కానీ అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని గావస్కర్‌ వివరించాడు.


నాలుగేళ్ల క్రితం టీమ్‌ఇండియాకు యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ప్రధాన పేసర్లుగా ఉండేవారు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత వీరు గాడి తప్పారు. ఫామ్‌ కోల్పోయారు. కుల్‌దీప్‌ అయితే రెండేళ్ల వరకు వికెట్లేమీ తీయకుండా ఒత్తిడికి లోనయ్యాడు. ఏడాది క్రితమే బలంగా పుంజుకున్నాడు. 2022 నుంచి ఇప్పటి వరకు 19 వన్డేల్లో 34 వికెట్లు పడగొట్టాడు. యూజీ మాత్రం 16 మ్యాచుల్లో 21 తీశాడు. అతడితో పోలిస్తే కుల్‌దీప్‌ చాలా బాగా బ్యాటింగ్‌ చేస్తాడు. అంత తేలిగ్గా వికెట్‌ ఇవ్వడు. ప్రధాన ఆటగాడు క్రీజులో నిలబడితే సింగిల్స్‌ తీసి స్ట్రైక్‌ ఇస్తాడు. ఎవరూ లేకుంటే సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నిస్తాడు.


ఆసియాకప్‌ 2023కి టీమ్‌ఇండియాను సోమవారం ఎంపిక చేశారు. రిజర్వు ఆటగాడితో కలిపి 18 మంది పేర్లను ప్రకటించారు. గాయాలతో సుదీర్ఘ కాలం దూరమైన కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మెగా టోర్నీలో పునరాగమనం చేస్తున్నారు. హైదరాబాదీ యువకెరటం, టీ20 క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న తిలక్‌ వర్మకు చోటు దక్కింది. అతడు వన్డేల్లో ఇప్పటి వరకు అరంగేట్రం చేయకపోవడం గమనార్హం. ఫాస్టు బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ టోర్నీకి ఎంపికయ్యారు.


భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ


రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్‌


Also Read: టీమ్‌ఇండియాకు అన్నీ ఎక్కువే.. అదే అసలు సమస్య! దాదా కామెంట్స్‌!