Asia Cup 2023: ఆసియా కప్‌లో శనివారం తమ తొలి మ్యాచ్ ఆడిన భారత క్రికెట్ జట్టు వర్షం కారణంగా అర్థాంతరంగా నిలిచిన పోరులో ఆశించినస్థాయిలో రాణించలేదు. మ్యాచ్ పూర్తైతే ఫలితం ఎలా ఉండేదో ఏమో గానీ పాక్ బౌలింగ్‌కు భారత టాపార్డర్ బెంబేలెత్తింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోవడంతో భారత్ - పాక్‌లకు తలా ఓ పాయింట్ దక్కింది. భారత జట్టు సెప్టెంబర్ 4న నేపాల్‌తో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వర్షం భారత్ -నేపాల్ మ్యాచ్‌కూ అడ్డంకులు సృష్టిస్తే టీమిండియా ముందంజ వేయగలదా..?
వరుణుడు కరుణించకుంటే...!
భారత్ - పాక్ మ్యాచ్ జరిగిన పల్లెకెలెలోనే నేపాల్ మ్యాచ్ కూడా జరుగనుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సోమవారం కూడా ఇక్కడ వర్షం కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సోమవారం వర్షం కురిసే అవకాశఆలు 80 శాతం ఉండటం భారత క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఒకవేళ ఇదే జరిగి మ్యాచ్ రద్దు అయితే అప్పుడు సమీకరణాలు కింది విధంగా ఉంటాయి.
- గ్రూప్ - ఏలో ఉన్న ఇండియా, నేపాల్, పాకిస్తాన్‌లలో ఆతిథ్య పాక్ జట్టు ఇదివరకే సూపర్ - 4కు అర్హత సాధించింది. నేపాల్‌తో మ్యాచ్‌ను భారీ తేడాతో గెలుచుకున్న పాక్.. భారత్ తో మ్యాచ్ అర్థాంతరంగా నిలిపేయడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది.
- భారత్ సూపర్ - 4 కు అర్హత సాధించాలంటే నేపాల్‌తో మ్యాచ్ లో కచ్చితంగా నెగ్గాలి. అయితే పసికూనపై నెగ్గడం లాంఛనమే అయినప్పటికీ వర్షం కారణంగా ఆట సాగకుంటే మాత్రం ఇరు జట్లకూ తలా ఓ పాయింట్ దక్కనుంది.
- అలా చూస్తే ఇదివరకే ఒక పాయింట్ దక్కించుకున్న భారత జట్టు ఖాతాలో మరో పాయింట్ యాడ్ అయి రెండు పాయింట్లతో ఉంటుంది. ఇదివరకే ఒక మ్యాచ్‌లో ఓడిన నేపాల్ ఖాతాలో ఒక్క పాయింట్ మాత్రమే ఉండనుంది. ఇదే క్రమంలో మ్యాచ్ సజావుగా సాగి నేపాల్ గనక భారత్‌కు షాకిస్తే అప్పుడు సూపర్ - 4కు ఆ జట్టు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. శనివారం భారత్ - పాక్ ఆటను ముంచిన వరుణుడు సోమవారం ఏం చేస్తాడో మరి..
టోర్నీ షిఫ్ట్ అవుతుందా..?
పల్లెకెలెలో వర్షం కారణంగా దాయాదుల పోరు రద్దు కావడంతో ఆసియా కప్ ను పల్లెకెలె నుంచి షిఫ్ట్ చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి. పలు జాతీయ వెబ్‌సైట్లు కూడా టోర్నీ వేదికలను మార్చేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) భావిస్తున్నదని కథనాలు వెలువడ్డాయి. హైఓల్టేజ్ మ్యాచ్ అయిన భారత్ - పాక్ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడం అభిమానులకు నచ్చలేదు. దీంతో శ్రీలంకలో వానాకాలం అని తెలిసి కూడా పల్లెకెలెలో మ్యాచ్‌లను నిర్వహించడం తెలివితక్కువతనమే అవుతుందని క్రికెట్ ఫ్యాన్స్ ఏసీసీని తిట్టిపోస్తున్నారు. అయితే క్యాండీలో నేపాల్‌తో ఒక్క మ్యాచ్ మాత్రమే జరుగనుంది. ఆ తర్వాత శ్రీలంకలో జరుగబోయే మ్యాచ్‌లు అన్నీ కొలంబోలోనే జరుగనున్నాయి. కొలంబోలో కూడా ఇదే పరిస్థితులు ఏర్పడితే మాత్రం అభిమానులకు షాకులు తప్పవు. దీనిపై ఏసీసీ కూడా ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial