Asia Cup, IND Vs PAK: ఆసియా కప్ - 2023లో భాగంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతున్నది. సూపర్ - 4లో భారత్ - పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 10న జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో ఆ మ్యాచ్‌కు రిజర్వ్ డే ను కేటాయిస్తూ ఏసీసీ తీసుకున్న నిర్ణయంపై మిగిలిన రెండు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తామేం పాపం చేశామని, తమ మ్యాచ్‌లకూ వర్షం కురిసే అవకాశం ఉందని, ఏకపక్ష నిర్ణయాలు సరికాదంటూ శ్రీలంక, బంగ్లాదేశ్ హెడ్‌కోచ్‌లు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ టోర్నీలో భారత్ - పాకిస్తాన్ మధ్య గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్ వర్షార్పణమైన విషయం తెలిసిందే. ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే సాధ్యమైన ఆ మ్యాచ్ అర్థాంతరంగా ముగియడంతో ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ అధ్యక్షుడు నజమ్ సేథీతో పాటు ఇతర సభ్యులు కూడా ఏసీసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సీజన్‌లో శ్రీలంకలో వర్షాలు కురుస్తాయని తెలిసి కూడా మ్యాచ్ లు నిర్వహించడంపై దుమ్మెత్తిపోశారు. దీంతో ఏసీసీ.. ఆదివారం జరుగబోయే భారత్ - పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ను కేటాయించింది.
మా మ్యాచ్‌లకు వర్షాలు కురవవా..?
ఏసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్ హెడ్‌కోచ చండిక హతురుసింఘ మాట్లాడుతూ... ‘అది కరెక్ట్ కాదు. మాకు కూడా రిజర్వ్ డే కేటాయించాల్సింది. కానీ నేను దీనిమీద మరిన్ని కామెంట్స్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇందులో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకునేముందు వాళ్లు మమ్మల్ని కూడా అడిగి ఉంటే మేం మా అభిప్రాయం చెప్పేవాళ్లం..’అని చెప్పాడు. చండిక వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏసీసీ ఈ నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నదన్న వాదన వినిపిస్తున్నది.
నేనైతే షాక్ అయ్యా..
ఇదే విషయమై శ్రీలంక హెడ్‌కోచ్ సిల్వర్‌వుడ్ మాట్లాడుతూ.. ‘నేను ఈ విషయం వినగానే ఆశ్చర్యానికి గురయ్యా. కానీ అసలు విషయం ఏంటంటే ఈ టోర్నీ నిర్వాహకులం మేం కాదు. ఈ విషయంలో మేం ఏం చేయలేం. ఇలా చేస్తే దాని ప్రభావం టీమ్స్ పాయింట్స్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అదే నా ప్రధానమైన ఆందోళన’ అని తెలిపాడు.
సూపర్-4 పోటీలు జరగాల్సిన కొలంబోలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు లంక - బంగ్లా మధ్య జరగాల్సిన మ్యాచ్‌కూ వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు 60 శాతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కోచ్‌లు చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే పది రోజుల పాటు కొలంబోలో వర్షాలు పడే అవకాశం ఉన్నా ఏసీసీ మాత్రం భారత్ - పాక్ మ్యాచ్‌కే రిజర్వ్ డే కేటాయించింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial