India vs Pakistan, Asia Cup 2023: 2023 ఆసియా కప్‌లో సూపర్-4 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు సెప్టెంబరు 10వ తేదీన భారత్-పాక్ మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి ఆడే పదకొండు మందిని ఎంపిక చేయడం కెప్టెన్ రోహిత్ శర్మకు అంత సులువు కాదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత జట్టు ఎలా ఉంటుందనే విషయంలో ఇప్పుడు ఆసక్తి నెలకొంది.


పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు జస్‌ప్రీత్ బుమ్రా టీం ఇండియాలో చేరాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ కూడా పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ల మధ్య ఎవరికి చోటు ఇవ్వాలనేది పెద్ద ప్రశ్న. అలాగే బుమ్రా రీఎంట్రీ ఇస్తే షమీ, శార్దూల్‌ల మధ్య ఎవరిని తొలగించాలనేది కూడా తలనొప్పి కలిగించే ప్రశ్న.


ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించడంతో కేఎల్ రాహుల్ శ్రీలంకలో టీం ఇండియాలో చేరాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు, అతను జట్టుతో కలిసి తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. అతని స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ పాకిస్తాన్‌పై 82 పరుగుల మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌లలో ఒకరిని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎంపిక చేయడం అంత సులువు కాదు.


దీంతో పాటు పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు జస్‌ప్రీత్ బుమ్రా కూడా జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు బుమ్రా పునరాగమనం చేస్తే షమీ లేదా శార్దూల్ బయటకు వెళ్లాల్సి ఉంటుంది. 2023 ఆసియా కప్ లీగ్ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ... బుమ్రా, సిరాజ్‌లతో పాటు శార్దూల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించగా, షమీ బెంచ్‌పై కూర్చోవలసి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.


ఆసియా కప్‌ 2023లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇంతకు ముందు జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ బ్రేక్‌లో ప్రారంభం అయిన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ నిలిపివేశారు. దాదాపు రాత్రి 10 గంటల వరకు మ్యాచ్ నిర్వహించడానికే ప్రయత్నించారు. కానీ ఎడతెరపని వర్షం కారణంగా మ్యాచ్ జరగడం అస్సలు సాధ్యం కాలేదు.


ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ సాయంత్రం 7:45 గంటలకు ముగిసింది. వెంటనే 7:50 గంటలకే వర్షం ప్రారంభం అయింది. రాత్రి 8:30 గంటలకు వర్షం కాస్త తగ్గింది. ఆ సమయంలో అధికారులు గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడారు. తొమ్మిది గంటల సమయంలో పిచ్‌ను పరీక్షించాలని కూడా అనుకున్నారు. ఒకవేళ వర్షం తగ్గితే 25 నుంచి 30 ఓవర్ల మధ్య నిడివిలో మ్యాచ్‌ను నిర్వహించాలని అనుకున్నారు.


కానీ ఆ తర్వాత వర్షం తిరిగి ప్రారంభం అయింది. అస్సలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో రాత్రి 10:30 సమయానికి మ్యాచ్ నిర్వహించడం సాధ్యమైతే 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని కటాఫ్‌గా పెట్టుకున్నారు. కానీ అప్పటికి కూడా వర్షం తగ్గేలా కనిపించలేదు. ఈ కారణంగా దాదాపు 10 గంటల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.