IND vs PAK, Asia Cup 2023: ఆసియా కప్‌లో నేడు పాకిస్తాన్‌తో జరుగబోయే తొలి మ్యాచ్‌ ద్వారా టోర్నీని ప్రారంభించనున్న  భారత్   జట్టు.. తుది జట్టులో  కీలక మార్పులు చేసింది. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన  మెన్ ఇన్ బ్లూ.. టీమిండియా వెటరన్ పేసర్   మహ్మద్ షమీ  లేకుండానే బరిలోకి దిగుతోంది.   అతడి స్థానంలో హిట్‌మ్యాన్.. శార్దూల్ ఠాకూర్‌ను ఎంచుకున్నాడు.  


షమీకి ఏమైంది..? 


ఈ మ్యాచ్‌లో రోహిత్.. షమీని కాదని ఠాకూర్ వైపునకు మొగ్గుచూపడం  భారత అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులను కూడా  ఆశ్చర్యానికి గురిచేసింది.  షమీకి ఏమైంది..? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది  జూన్‌లో  ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడిన షమీ  ఆ తర్వాత  మళ్లీ మ్యాచ్ ఆడలేదు. వెస్టిండీస్‌తో  మూడు ఫార్మాట్ల సిరీస్‌లకూ షమీ  దూరంగానే ఉన్నాడు. సుమారు రెండున్నర నెలలుగా విరామం తీసుకుంటున్న షమీ.. ఇటీవల  బెంగళూరులో జరిగిన టీమిండియా శిక్షణా శిబిరంలో కూడా పాల్గొన్నాడు.  అక్కడ  బుమ్రా, సిరాజ్‌లతో కలిసి బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన  షమీ..  శ్రీలంకకు  టీమ్‌తో వచ్చి ఉత్సాహంగానే కనిపించాడు.  షమీకి గాయమైనట్టు కూడా ఎక్కడా వార్తలు రాలేదు. అయినా రోహిత్.. అనుభవం ఉన్న పేసర్‌ను పక్కనబెట్టడం గమనార్హం. 


ఠాకూర్ ఎందుకు..? 


షమీని కాదని భారత్.. తుది జట్టులో లార్డ్ శార్దూల్ ఠాకూర్‌ను  ఎంపిక చేసింది.   డబ్ల్యూటీసీ ఫైనల్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ మెరిసిన శార్దూల్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో మెరుగ్గానే ఆడాడు. అయితే ఠాకూర్‌ను ఎంపిక చేయడానికి కారణం అతడు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయడమేనని భావించినా.. పటిష్టమైన పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చాలంటే షమీ వంటి  సీనియర్ పేసర్  అవసరం టీమిండియాకు ఎంతైనా ఉంది.  టాస్ ముగిసి భారత్ తుది జట్టును ప్రకటించిన తర్వాత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  


మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘ఠాకూర్ కంటే షమీని తుదిజట్టులోకి తీసుకుని ఉంటే బాగుండేది. అతడు  ప్రమాదకర బౌలర్.  మీరు బ్యాటింగ్ డెప్త్ గురించి మాట్లాడుతున్నారు గానీ  మ్యాచ్ గెలవాలంటే బౌలింగ్ కూడా ముఖ్యమే కదా..’ అని  వ్యాఖ్యానించాడు.  మరి  అనుభవజ్ఞుడైన షమీని తప్పించి   ఠాకూర్‌ను తీసుకొచ్చిన హిట్‌మ్యాన్ చేసిన ప్రయోగం విజయవంతమైతే  ఏ నష్టమూ లేదుగానీ బెడిసికొడితే మాత్రం అభిమానుల రియాక్షన్ మాత్రం రాక్ సాలిడ్‌గా ఉండటం ఖాయం.  చూద్దాం.. లార్డ్ ఏం చేస్తాడో మరి...!


 






పాక్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు:  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


పాకిస్థాన్ : ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్



















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial