Indian Cricket Team: సాధారణంగా మనకేదన్నా ప్రాబ్లం ఉందనుకోండి. ఆ ఎఫెక్ట్ మనం చేసే పనుల మీద పడుతుంది. తెలిసో తెలియకుండానో మనకున్న సమస్యలు...మానసిక ధైర్యాన్ని కుంగదీసి మనల్ని అశక్తుల్ని చేస్తాయి. ఇది ఇండివిడ్యువల్స్ తో మొదలు పెట్టి ఒక జట్టు వరకూ ఎవరికైనా వర్తిస్తుంది. ఇప్పుడు ఆసియా కప్ లో క్రికెట్ టీమ్స్ ను చూస్తే ఈ లాజిక్ తప్పేమో అనిపిస్తోంది. ఇక్కడ ఐరనీ ఏంటంటే సమస్యలున్న వాళ్లంతా దాని ప్రభావం వాళ్ల మీద లేకుండా చితక్కొట్టేసే ఫర్మార్మెన్స్ ఇస్తుంటే...ఆల్ హ్యాపీస్ అనుకున్న వాళ్లేమో నిర్లక్ష్యానికి నిజమైన వారసులం మేమే అన్నట్లు ఆడారు. నేనేం ఎగ్జాగరేట్ చేయట్లేదు కానీ ఈ ప్యాట్రన్ ఓ సారి చూడండి మీకే అర్థం అవుతుంది.


1. శ్రీలంక


శ్రీలంక లో ఇప్పుడున్న పరిస్థితులేంటో సోషల్ మీడియా టచ్ ఉన్న ఎవరైనా చెప్పేస్తారు. తినటానికి సరైన తిండి లేక రోడ్ల మీద నెలల తరబడి వాళ్లు చేస్తున్న పోరాటాలు...అక్కడున్న ఆర్థిక సంక్షోభం అందరికీ తెలుసు. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లపై దాడులు చేసి వాళ్లను కూడా తరిమేసి తమకు తాముగా రాజకీయ స్వేచ్ఛ కల్పించుకున్న శ్రీలంక ప్రజలు ఇప్పుడిప్పుడే భారీ సంక్షోభం నుంచి కోలుకుంటున్నారు! రాజకీయంగా ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు సర్దుకుంటున్నాయి కానీ భారీ ధరలు, ఆకలితో అల్లాడుతున్న ప్రజలు, నిత్యావసరాల కోసం క్యూలైన్లలో కిలోమీటర్ల పాటు నిలబడుతున్న జనం ఇప్పటికీ ఇంకా అక్కడ కనబడుతున్నారు. అసలు ఇంతటి ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక క్రికెట్ ఆడుతుందంటే ఎంతో గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. తమను నమ్మి అవకాశం ఇచ్చిన లంక బోర్డు, స్పాన్లర్ల నమ్మకాన్ని నిలబెట్టేలా స్థాయికి మించి పోరాటం చేస్తున్నారు దసున్ షనక అండ్ టీం. కీలకమైన మ్యాచ్ లో భారత్ ఎంత ప్రయత్నిస్తున్నా.. చిన్న టీమ్ అని తమను తాము తక్కువ అంచనా వేసుకోకుండా ప్రతీ పరుగు కోసం వాళ్లు చేసిన పోరాటానికి ప్రతీ క్రికెట్ అభిమానీ ఫిదా అయ్యాడు. అదీ ఓ ఆటగాడికి ఉండాల్సిన కసి.


2. పాకిస్థాన్


ఈ మాట అంటే చాలా మంది భారత క్రికెట్ లవర్స్ అఫెండ్ అవ్వొచ్చేమో కానీ ఇప్పుడున్న నయా పాకిస్థాన్ ఒకప్పటిలా మబ్బు టీం కాదు. బాబర్ ఆజమ్, రిజ్వాన్ , ఫకర్ జమాన్ లాంటి స్టార్ బ్యాటర్లు, బుల్లెట్ల లాంటి బంతులు విసురుతున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ బౌలర్లతో పాకిస్థాన్ గత పదిపదిహేనళ్లలో కనపించినంత శక్తిమంతంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి రిజ్వాన్ లీగ్ మ్యాచులు, సూపర్ ఫోర్ లో ఇండియాపై ఎలా ఆడాడో చూశాం. కాలు బెణికినా... నడవలేకపోతున్నా ఫీల్డ్ వదల్లేదు. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ అదిరిపోయే ఫర్మాఫార్మెన్స్ ఇచ్చాడు. మీరు చూసే ఉంటారు పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. హిమానీ నదాల నుంచి వచ్చిన వరదలు అక్కడ మెజారిటీ రాష్ట్రాలను ముంచెత్తాయి. అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల మంది చనిపోయారు. ఇంకా రెండు లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. తూర్పు పాకిస్థాన్ రాష్ట్రాల్లో ప్రజల రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయ అస్థిరత ఏర్పడింది. పూట అన్నం కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఇప్పుడక్కడ ఉన్నాయి. ఇక తీవ్రవాదం, రాజకీయ కుమ్ములాటలు, ఆత్మాహుతి దాడులు  అక్కడ షరా మామూలే. అసలు తీవ్రవాదం తో బలైపోతున్న ప్రధాన దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటి. మరి అలాంటి అస్థిర పరిస్థితుల్లో యంగ్ పాకిస్థాన్ ఎంత బాగా పోరాటం చేస్తోంది. ఎక్కడైనా తగ్గుతున్నారా ఆలోచించండి.


3. అఫ్గానిస్థాన్‌


అఫ్గానిస్థాన్ లో ప్రస్తుతం నడుస్తున్న తాలిబన్ల పాలన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలిప్పుడు అఫ్గానిస్థాన్ క్రికెట్ ఆడుతుంది కానీ తాలిబన్లు పర్మిషన్ ఇవ్వం అంటే ఒలింపిక్స్ అవకాశమైన సరే వదులుకోవాల్సిందే. హిజాబ్ వేసుకుని లాంగ్ జంప్ చేయమన్నారు ఓ ప్లేయర్ ని మొన్నటి గేమ్స్ లో. ఇంతటి ఆంక్షలున్నాయి అక్కడి ఆటగాళ్లపై, క్రీడలపై. ఇంతటి అస్థిరత మధ్యలో అఫ్గాన్ ఆడుతున్న తీరు నిజంగా ప్రశంసించాల్సిందే.  లంకపై మొదటి సూపర్ ఫోర్ మ్యాచ్ లో తృటిలో ఓటమిపాలైంది కానీ గ్రూప్‌ స్టేజ్‌లో అఫ్గాన్‌ అదరగొట్టేసి మరీ సూపర్‌-4లోకి అడుగుపెట్టిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు.


4. హాంకాంగ్


వీళ్లకు విజయాలు లేకుండా పోయుండొచ్చు. వీళ్లు లీగ్ స్టేజ్ లో ఇంటి దారి పట్టి ఉండొచ్చు. కానీ వీళ్ల ఇన్ స్పిరేషన్ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. హాంకాంగ్ టీమ్ అంతా ప్రొఫెషనల్స్ కాదు. ఒకళ్లు డెలివరీ బాయ్. మరొకరు దుకాణంలో పని చేస్తారు. ఇంకొకరు యూనివర్సిటీలో స్టూడెంట్. కొవిడ్ టైం లో బోర్డు నుంచి ఆర్థిక సహకారం లేక బతకటం కోసం చేతికి దొరికిన పని చేశారు హాంకాంగ్ క్రికెటర్లు. ఇప్పుడు మూడునెలలుగా ఇంటికి వెళ్లకుండా వరుసగా మ్యాచ్ లు, సిరీస్ లు ఆడుతున్నారు. కోహ్లీకి తమ జెర్సీ ఇచ్చి మద్దతు తెలపటం, ఆడిన మ్యాచ్ ల్లో మంచి ప్రదర్శనలే చేసి ఆకట్టుకున్న హాంకాంగ్ ప్లేయర్ల జర్నీ పై ఇంటర్నేషనల్ మీడియా, క్రికెట్ లవర్స్ ప్రశంసల వర్షం కురిపించారు. 


ఇదీ సంగతి.  ఇప్పుడు ఇండియా కు ఈ కష్టాల్లో ఏమన్నా ఉన్నాయా. ఒక్కటైనా. అసలు బీసీసీఐ అంతటి ధనిక బోర్డు ప్రపంచంలో ఉందా. ప్రతీ క్రికెటర్ కు లక్షల్లో జీతాలు. కోట్ల రూపాయలు కుమ్మరించే ఎండార్స్ మెంట్లు, సెలబ్రెటీ స్టేటస్ లు, సినిమా హీరోలంతటి క్రేజ్...అబ్బో ఒక్కటేంటీ. ఇదంతా మనోళ్లు కష్టపడకుండా వచ్చింది నేను అనటం లేదు. మిగతా దేశాల్లో వేరు. ఇండియాలో వేరు. ఇక్కడ ప్లేయర్ టీమిండియా కు సెలెక్ట్ అయ్యాడంటే 130 కోట్ల మంది నుంచి తనను తాను నిరూపించుకుని వచ్చినవాడని బాగా తెలుసు. బట్ మిగిలిన టీమ్స్ అంతటి అస్థిర పరిస్థితుల మధ్య ఆ ప్రెజర్ మైండ్ మీద పడనీయకుండా తమను తాము నిరూపించుకోవాలని వచ్చిన అవకాశాల మీద చూపించిన కసి.. టీమిండియాలో మిస్ అయ్యిందని చెప్పటమే ఉద్దేశం. ఐపీఎల్ లో ఆడితేనే ఆడినట్లు... టీమిండియా కు టైం పాస్ అన్నట్లు సెలక్షన్ కమిటీ నుంచి ఆన్ ఫీల్డ్ నిర్ణయాల వరకూ వహిస్తున్న నిర్లక్ష్యం చూస్తుంటే భవిష్యత్ టోర్నీల పైన దీని ప్రభావం పడుతుందేమో అనే టెన్షన్. అందుకే టీంఇండియా ఇప్పటికైనా మేల్కోవాలి. స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన టీమ్ లతో ఆటగాళ్లలో భరోసా కల్పించాలి. మితిమీరిన ప్రయోగాలకు పోకుండా ప్రతీ మ్యాచ్ పై శ్రద్ధ కనిపించనప్పుడే వరల్డ్ కప్ స్టేజుల్లో మనమో సీరియస్ టీమ్ గా నిలబడగలుగుతాం.