IND vs SL Match Highlights: కోరుకున్నది ఒకటి! జరిగింది మరొకటి! ఆసియాకప్‌ను 8వ సారి గెలవాలన్న టీమ్‌ఇండియా ఆశలు నెరవేరలేదు. శ్రీలంకతో జరిగిన సూపర్‌-4 మ్యాచులో హిట్‌మ్యాన్‌ సేన ఊహించని రీతిలో ఓటమి పాలైంది.  173 పరుగుల్ని కాపాడుకోలేక 6 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. అవమానకరమైన రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది! ఒకవేళ అఫ్గాన్‌ మ్యాచులో గెలిచినా ఫైనల్‌ చేరాలంటే కనీవినీ ఎరగని అద్భుతాలే జరగాలి.


మోస్తరు లక్ష్య ఛేదనలో పాథుమ్‌ నిసాంక (52; 37 బంతుల్లో 4x4, 2x6), కుశాల్‌ మెండిస్‌ (57; 37 బంతుల్లో 4x4, 3x6) దంచికొట్టారు. భానుక రాజపక్స (25*; 17 బంతుల్లో 0x4, 2x6), దసున్ శనక (33*; 18 బంతుల్లో 4x4, 1x6) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో రోహిత్‌ శర్మ (72; 41 బంతుల్లో 5x4, 2x6), సూర్య కుమార్‌ యాదవ్‌ (34; 29 బంతుల్లో 1x4, 1x6) అదుర్స్‌ అనిపించారు. 


ఆఖర్లో టెన్షన్‌ పెట్టినా!


బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌! ఎదురు మోస్తరు లక్ష్యమే! పైగా టీ20 ఛేదనల్లో లంకేయులకు తిరుగులేదు! అయితే టీమ్‌ఇండియా బౌలర్లపై ఎక్కడో చిన్న ఆశ. ఏదైనా అద్భుతం చేయకపోతారా అని! అయితే ఓపెనర్లు పాథుమ్‌ నిసాంక (52), కుశాల్‌ మెండిస్‌ (57) అందుకు అవకాశమే ఇవ్వలేదు. తొలి 2 ఓవర్లు మినహాయించి దంచుడు షురూ చేశారు. నువ్వా నేనా అన్నట్టు పోటీపడి మరీ కొట్టారు. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికే లంక వికెట్‌ నష్టపోకుండా 57 రన్స్‌ చేసింది. 10 ఓవర్ల వరకు వారి జోరు అలాగే కొనసాగింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం అందించారు.


కొరకరాని కొయ్యగా మారిన ఈ జోడీని 11.1వ బంతికి నిసాంకను ఔట్‌ చేయడం ద్వారా చాహల్‌ విడదీశాడు. అదే ఓవర్లో అసలంక (0)నూ పెవిలియన్‌ పంపించాడు. జట్టు స్కోరు 110 వద్ద గుణతిలక (1) అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ప్రమాదకర కుశాల్‌ మెండిస్‌ను చాహల్‌ ఎల్బీ చేయడంతో టీమ్‌ఇండియాకు ఆశలు మొలిచాయి. లంక 15 ఓవర్లకు 121-4తో నిలవడంతో సమీకరణం 30 బంతుల్లో 54గా మారింది. అయితే రాజపక్స, దసున్ శనక బౌండరీలు కొట్టి టెన్షన్‌ పెట్టారు. ఆఖరి 12 బంతుల్లో 21 పరుగులు అవసరం కాగా భువీ 19వ ఓవర్లో 14 పరుగులు ఇవ్వడంతో ఆశలు ఆవిరయ్యాయి. ఆఖరి ఓవర్లో 7 రన్స్‌ను ఇవ్వకుండా ఉండేందుకు అర్షదీప్‌ పడ్డ కష్టం చిన్న తప్పిదంతో వృథా అయింది.  


రోహిత్‌ ఒక్కడే!


అంతకు ముందు టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. 3 ఓవర్లకే కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ వికెట్లు చేజార్చుకొని 3 ఓవర్లకు 15తో నిలిచింది. తీవ్ర ఒత్తిడిలో కష్టాల్లో చిక్కుకున్న జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ (71) అద్భుతమైన అర్ధశతకంతో ఆదుకున్నాడు.  సూర్య కుమార్‌ యాదవ్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం అందించాడు. మంచి బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. దాంతో 10 ఓవర్లకు భారత్ 79-2తో నిలిచింది. గేర్లు మార్చి స్కోరు బోర్డును పరుగెత్తించిన హిట్‌మ్యాన్‌ను కరుణరత్నే ఔట్‌ చేశాడు. 13 వ ఓవర్లో నిశాంకకు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. తర్వాత పంత్ కు బదులు పాండ్య క్రీజులోకి వచ్చాడు. కానీ  కాసేపటికే సూర్య(34) ఓ షార్ట్ పిచ్ బంతికి ఔటవ్వడంతో మళ్లీ ఒత్తిడి పెరిగింది. 18వ ఓవర్లో శనక బౌలింగ్ లో పాండ్య ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే దీపక్ హుడా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే పంత్ వెనుదిరిగాడు. చివరి 3 ఓవర్లలో బ్యాటింగ్ లో తడబడిన భారత్ అశ్విన్‌ సిక్సర్‌తో 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది.