IND vs SL 1st Innings Highlights: సూపర్- 4 లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో టీమిండియా 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ అర్థశతకంతో (71) మెరిశాడు. సూర్యకుమార్ (34) రాణించాడు. 


టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్ ను పేలవంగా ఆరంభించింది. ఓపెనర్లు రోహిత, రాహుల్ పరుగులు చేయడానికి ఇబ్బందిపడ్డారు. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ ను లంక బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. రెండో ఓవర్లోనే రాహుల్ (6) ఎల్బీడబ్య్లుగా వెనుదిరిగాడు. ఆ వెంటనే ఫామ్ లో ఉన్న కోహ్లీ మదుశంక బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు.  3 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన భారత్ 15 పరుగులు చేసింది.


వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రోహిత్, సూర్య ఆదుకున్నారు. ముఖ్యంగా రోహిత్ ఆచితూచి ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలు రాబట్టాడు. సూర్య అతనికి చక్కని సహకారాన్నిచ్చాడు.  రోహిత్ శర్మ జోరుతో 10 ఓవర్లకు భారత్ 79 పరుగులు చేసింది. అర్థ శతకం తర్వాత రోహిత్ దూకుడు పెంచాడు. సిక్సర్లు, బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే భారత కెప్టెన్ జోరుకు కరుణరత్నే బ్రేకులు వేశాడు. 13 వ ఓవర్లో అతని బౌలింగ్ లో నిశాంకకు క్యాచ్ ఇచ్చి రోహిత్ (71) ఔట్ అయ్యాడు. తర్వాత పంత్ కు బదులు పాండ్య క్రీజులోకి వచ్చాడు.  ఆ వెంటనే సూర్య(34) ఓ షార్ట్ పిచ్ బంతికి ఔటయ్యాడు. 


అనంతరం వచ్చిన పంత్ వచ్చీ రావడంతోనే బౌండరీలు కొట్టాడు. పాండ్య కూడా అడపా దడపా బంతిని స్టాండ్స్ లోకి తరలించటంతో స్కోరు బోర్డు కదిలింది. 18వ ఓవర్లో శనక బౌలింగ్ లో పాండ్య ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే దీపక్ హుడా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే పంత్ కూడా వెనుదిరిగాడు. చివరి 3 ఓవర్లలో బ్యాటింగ్ లో తడబడిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది.