ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్‌తో గెలవడం ద్వారా పాకిస్తాన్, శ్రీలంక ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, భారత్ ఇంటిబాట పట్టాయి. దీంతో ఆసియాకప్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లూ నామమాత్రంగా మారాయి.


మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ 19.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా, నసీం షా (14 నాటౌట్: 4 బంతుల్లో, రెండు సిక్సర్లు) మొదటి రెండు బంతుల్లో సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ మొదట వేగంగానే ప్రారంభం అయింది. ఓపెనర్లు జజాయ్ (21: 17 బంతుల్లో, నాలుగు ఫోర్లు), గుర్బాజ్ (17: 11 బంతుల్లో, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు నాలుగు ఓవర్లలోనే 36 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరి తర్వాత వచ్చిన వారు నిదానంగా ఆడటంతో స్కోరు వేగం నెమ్మదించింది.


ఇబ్రహీం జద్రాన్ (35: 37 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), కరీం జనత్ (15: 19 బంతుల్లో, ఒక ఫోర్), నజీబుల్లా (10: 11 బంతుల్లో, ఒక సిక్సర్)... ముగ్గురి స్ట్రైక్ రేట్ 100 లోపే ఉండటంతో స్కోరు బాగా నిదానించింది. చివర్లో రషీద్ ఖాన్ (18: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) రెండు బౌండరీలు, ఒక సిక్సర్ కొట్టడంతో కనీసం 120 పరుగుల మార్కును అయినా ఆఫ్ఘనిస్తాన్ దాటింది.


అనంతరం పాకిస్తాన్ ఇన్నింగ్స్ కూడా గొప్పగా ఏమీ సాగలేదు. టాప్-4 బ్యాటర్లలో ఒక్కరి స్ట్రైక్ రేట్ కూడా 100 దాటకపోవడం విశేషం. షాదబ్ ఖాన్‌ (36: 26 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), ఇఫ్తికర్ అహ్మద్ (30: 33 బంతుల్లో, రెండు ఫోర్లు)ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా...  చివర్లో ఆసిఫ్ అలీ (16: 8 బంతుల్లో, రెండు సిక్సర్లు) రెండు సిక్సర్లతో పాక్‌ను మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. కానీ మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు గ్యాప్ ఇవ్వకుండా వికెట్లు తీస్తూనే ఉన్నారు.


అయితే కీలక సమయంలో ఆసిఫ్ అలీ కూడా అవుటయ్యాడు. విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు కావాల్సి ఉండగా మొదటి రెండు బంతులను సిక్సర్లుగా తరలించిన నసీం షా (14 నాటౌట్: 4 బంతుల్లో, రెండు సిక్సర్లు) పాకిస్తాన్‌కు ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందించాడు.