Arshdeep Singh: అతడో కుర్రాడు! వయసు 23 ఏళ్లు! అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసి ఇంకా వంద రోజులైనా కాలేదు! పాకిస్థాన్‌తో సూపర్ 4 మ్యాచులో విలువైన క్యాచ్ వదిలేశాడు! అంతే..! మిగతా వాళ్లు చేసిన పొరపాట్లు చిన్నవయ్యాయి. అతడు చేసిన తప్పిదం పెద్దైంది! పరోక్షంగా ఓటమికి కారకుడనే ముద్ర పడిపోయింది!
అతడు ఖలిస్థానీ! అందుకే అసిఫ్ అలీ క్యాచ్ వదిలేశాడని వికీపీడియా పేజీలో సమాచారాన్ని ట్యాంపర్ చేశారు. సోషల్ మీడియాలోనైతే అతడికి అసలు క్రికెట్ ఆడటం వచ్చా అన్నట్టుగా మీమ్స్ పోస్టు చేశారు. అసలెందుకీ పిల్ల బచ్చాతో ఆఖరి ఓవర్ వేయిస్తున్నారని మరికొందరి విమర్శ!
అయినా.. అతడు భయపడే రకం కాదు! ఎందుకంటే అతడు అర్షదీప్! ఇంతకీ ఈ పేరుకు అర్థం తెలుసా? చీకటిని చీల్చి వెలుతురు కిరణాలను ప్రసరించే సూర్యడని!
ఎంపిక వెనక లాజిక్కు ఇదే
టీమ్‌ఇండియాలో అర్షదీప్ ఎంట్రీ వెనక పెద్ద లాజిక్కే ఉంది! 2022, జులై 7న సౌథాంప్టన్‌లో ఇంగ్లాండ్‌పై అతడు అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 10 టీ20 మ్యాచులు ఆడాడు. అవకాశం దొరికిన ప్రతి మ్యాచులోనూ అదరగొట్టాడు. తన బౌలింగ్ అప్రోచ్‌తో మురిపించాడు. అందుకే అనుభవం లేకున్నా అత్యంత కీలకమైన ఆసియాకప్‌లో అతడిని తీసుకున్నారు. లెఫ్టార్మ్ మీడియం పేసర్ కావడం, నిలకడగా సరైన లెంగ్తుల్లో బంతులేయడం, చురకత్తుల్లాంటి యార్కర్లు సంధించడం అతడి ప్రత్యేకత. ప్రత్యర్థి బ్యాటర్ ఎంత భయపెట్టేరకమైనా అర్షదీప్ వెరవడు. అవతలి వారి మైండ్‌తో ఆటాడుకుంటాడు. ఇన్‌స్వింగర్, ఔట్ స్వింగర్, నకుల్, వైడ్ యార్కర్లు, నెయిల్ బైటింగ్ యార్కర్లు, లెంగ్త్ బాల్స్ మార్చి మార్చి వేసి ఓవర్‌ను సెటప్ చేస్తాడు. వికెట్ పడగొట్టేస్తాడు. లేదంటే పరుగుల్ని నియంత్రిస్తాడు.
లెఫ్టార్మ్ పేసర్ల విలువెక్కువ
జట్టులో ఎంతమంది పేసర్లున్నా ఒక లెఫ్టార్మ్ పేసర్‌కు ఉండే విలువే వేరు! వారు బంతిని విసిరే యాంగిల్, లెంగ్తులు డిఫరెంట్‌గా ఉంటాయి. రైట్ హ్యాండ్ బ్యాటర్లని ఇబ్బంది పెడతాయి. ఒకప్పుడు జహీర్ ఖాన్, ఆశీశ్ నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్ వంటి పేసర్లు ఈ బాధ్యత తీసుకున్నారు. వారు రిటైరయ్యాక సరైన లెఫ్టార్మ్ పేసర్లు దొరకలేదు. ఐపీఎల్ పుణ్యమా అని అర్షదీప్ ఆశలు రేపుతున్నాడు. పిట్ట కొంచమైనా కూత ఘనం అన్నట్టుగా చూడ్డానికి బక్కపల్చగా కనిపించే ఈ కుర్రాడి బుర్ర చాలా చాలా గట్టిది! పవర్ ప్లే, డెత్ ఓవర్లలో బ్యాటర్లు బౌండరీలు కొడితే బౌలర్లు వెనుకంజ వేస్తారు. అర్షదీప్ మాత్రం ఇందుకు భిన్నం. కన్సిస్టెంట్‌గా గుడ్ లెంగ్త్ బాల్స్ విసురుతాడు. 10 మ్యాచుల్లో 7.60 ఎకానమీ, 21.15 సగటుతో 13 వికెట్లు తీయడమే ఇందుకు నిదర్శనం. 17 లిస్ట్-ఏ మ్యాచుల్లో 4.67 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు. 37 ఐపీఎల్ మ్యాచుల్లో 8.35 ఎకానమీతో 40 వికెట్లు తీశాడు. 5 సార్లు 3, ఒక్కోసారి 4, 5 వికెట్ల ఘనత అందుకున్నాడు.
డెత్‌లో భయపడని వైనం
పాకిస్థాన్, శ్రీలంకతో సూపర్-4 మ్యాచుల్లో ఆఖరి ఓవర్లను అర్షదీప్‌నకు ఎందుకిచ్చారా అని చాలామంది సందేహం వచ్చే ఉంటుంది కదా! ఇందుకు చాలా రీజన్స్ లేకపోలేదు. ఆఖరి ఓవర్లలో అతడు నిబ్బరంగా, కుదురుగా బౌలింగ్ వేస్తాడు. ఇప్పటి వరకు అతడి కెరీర్లో వేసినవన్నీ పవర్‌ప్లే, డెత్ ఓవర్లే! ఆసియాకప్‌లో అతడు 4 మ్యాచులాడి 15.3 ఓవర్లు వేశాడు. 9.29 ఎకానమీ, 36 సగటుతో 4 వికెట్లు పడగొట్టాడు. 144 రన్స్ ఇచ్చాడు. దాదాపుగా అతడు వేసిన ఓవర్లన్నీ పవర్‌ప్లే, డెత్‌లోనివే. పాక్ మ్యాచులో ఆఖరి 12 బంతుల్లో 26 రన్స్ డిఫెండ్ చేసే క్రమంలో 19వ ఓవర్లో భువీ 19 రన్స్ ఇచ్చాడు. దాంతో ఆఖరి ఓవర్లో అర్షదీప్ 7 రన్స్ డిఫెండ్ చేయాల్సి వచ్చింది. అందుకు అతడేమీ భయడలేదు. కష్టమైనా సరే ఐదో బంతి వరకు లాక్కొచ్చాడు. లంక మ్యాచులోనూ ఆఖరి ఓవర్లో 7 రన్స్ కాపాడాల్సిన బాధ్యత మళ్లీ అతడిపైనే పడింది. అతడు ఒక్క బౌండరీ ఇవ్వకుండా వరుసగా 4 యార్కర్లు వేసి 5 రన్సే ఇచ్చాడు. ఐదో బంతికి ఫీల్డింగ్ పొరపాటుతో 2 బైస్ వచ్చాయి కానీ లేదంటే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లేలా అనిపించింది. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే అర్షదీప్ భవిష్యత్తు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు.