Ashes Series 2023: ‘బజ్‌బాల్’ ఊపులో ఉన్న ఇంగ్లాండ్ కు కంగారూలు డబుల్ స్ట్రోక్ ఇచ్చారు. బర్మింగ్‌హోమ్‌లో ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం కోసం చివరి ఓవర్ వరకూ పోరాడిన ఆసీస్.. లార్డ్స్ లో కూడా అలాంటి విజయాన్నే దక్కించుకుంది. కానీ ఈసారి పోరాటం బ్యాట్ తో కాదు, బంతితో... దాదాపు తొలి టెస్టులో ఆసీస్ స్థితిలోనే ఉన్న ఇంగ్లాండ్.. ఆఖర్లో వికెట్లను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంగ్లాండ్ ను గట్టెక్కించడానికి కెప్టెన్ బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155, 9 ఫోర్లు, 9 ఫోర్లు) వీరోచిత పోరాటం చేసినా.. 371 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 81.3 ఓవర్లలో 327 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో ఆసీస్.. 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను ఆసీస్ 2-0 తో ఆధిక్యంలో నిలిచింది.
బ్రేక్ ఇచ్చిన హెజిల్వుడ్..
ఆసీస్ నిర్దేశించిన 371 పరుగుల ఛేదనలో భాగంగా ఐదో రోజు ఓవర్ నైట్ స్కోరు 114-4 వద్ద ఆట ఆరంభించింది. హాఫ్ సెంచరీ చేసిన డకెట్ (112 బంతుల్లో 83, 9 ఫోర్లు)తో కలిసి స్టోక్స్ ధాటిగా ఆడాడు. మార్నింగ్ సెషన్ లో డకెట్ - స్టోక్స్ ఆసీస్ బౌలర్లను బాగానే ఎదుర్కున్నారు. కానీ హెజిల్వుడ్ ఈ జోడీని విడదీశాడు. అతడు వేసిన 45వ ఓవర్లో నాలుగో బంతికి డకెట్.. వికెట్ కీపర్ కేరీకి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 132 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే జానీ బెయిర్ స్టో (22 బంతుల్లో 10, 2 ఫోర్లు) వివాదాస్పద రీతిలో స్టంపౌట్ అయ్యాడు.
బెన్ స్టోక్స్ కెప్టెన్ ఇన్నింగ్స్..
డకెట్ నిష్క్రమించినా ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బెయిర్ స్టో నిష్క్రమించేటప్పటికీ స్టోక్స్.. 128 బంతుల్లో 62 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అప్పుడే స్టోక్స్ అసలు ఆట బయటపడింది. ఒక ఎండ్ లో స్టువర్ట్ బ్రాడ్ (36 బంతుల్లో 11, 2 ఫోర్లు) నిలబెట్టి ఆసీస్ బౌలర్లను చితకబాదాడు. ఈ ఇద్దరూ కలిసి ఏడో వికెట్ కు 107 పరుగులు జోడిస్తే ఇందులో బ్రాడ్ చేసింది 11 పరుగులంటే స్టోక్స్ వీరవిహారం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 82 పరుగుల వద్ద ఉండగా వరుసగా మూడు సిక్సర్లు కొట్టి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. స్టోక్స్ జోరు చూస్తే ఆసీస్ కు లార్డ్స్ లో పరాభవం తప్పదనే అనిపించింది. అవతలి ఎండ్ లో బ్రాడ్ కూడా నింపాదిగా ఆడటంతో ఇంగ్లాండ్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారంతా..
మళ్లీ అతడే..
ఆసీస్ కు భంగపాటు తప్పదు అనుకున్న ఇంగ్లాండ్ అభిమానులకు హెజిల్వుడ్ కోలుకోలేని షాకిచ్చాడు. గెలుపుదిశగా సాగుతున్న ఇంగ్లాండ్ ను చావుదెబ్బ కొట్టాడు. అతడు వేసిన 73వ ఓవర్లో మొదటి బంతికే స్టోక్స్.. వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చాడు. అంతే ఇంగ్లాండ్ ఓటమి ఖరారైంది. ఆ మరుసటి ఓవర్లో రాబిన్సన్ (1) ను కమిన్స్ పెవిలియన్ కు పంపాడు. స్టోక్స్ కు అండగా నిలిచిన బ్రాడ్ ను కూడా హెజిల్వుడ్ ఔట్ చేశాడు. చివర్లో జోష్ టంగ్ (19) ను స్టార్క్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ కథ ముగిసింది. ఆసీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సంక్షిప్త స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ : 416 ఆలౌట్
ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ : 325 ఆలౌట్
ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ : 279 ఆలౌట్
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ : 327 ఆలౌట్
ఫలితం : 43 పరుగుల తేడాతో ఆసీస్ విజయం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial