Ashes 2023 Bazball: ‘మేం గెలవడానికే ఆడతాం.  కొన్నిసార్లు మాకు అనుకూలంగా రిజల్ట్ రాకపోయినా  కచ్చితంగా డ్రా కోసం అయితే  ప్రయత్నించబోం’.. గతేడాది  పాకిస్తాన్  పర్యటనకు వచ్చిన  ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు ఇవి.   ముల్తాన్ టెస్టులో   ఐదో రోజు ఇక  మరో  నాలుగు ఓవర్లు అయితే మ్యాచ్ ముగుస్తుందనగా పాకిస్తాన్ ఆఖరి వికెట్ పడగొట్టి ఇంగ్లాండ్ ఘన విజయం సాధించిన  తర్వాత స్టోక్స్  పై విధంగా స్పందించాడు.  ఆస్ట్రేలియాతో మాంచెస్టర్ వేదికగా ముగిసిన  నాలుగో టెస్టు వరకూ  బెన్ స్టోక్స్ సేన ఒక్క మ్యాచ్ కూడా డ్రా చేసుకోలేదు. కానీ  మాంచెస్టర్‌లో మాత్రం ఆ జట్టుకు డ్రా తప్పలేదు.  


జో రూట్‌ నుంచి  2022 జూన్‌లో సారథ్య పగ్గాలు చేపట్టిన తర్వాత  బెన్ స్టోక్స్ 16 టెస్టులకు నాయకత్వం వహించాడు.  ఇందులో ఇప్పటివరకూ ఒక్క టెస్టు కూడా డ్రా చేసుకోలేదు. స్టోక్స్ 2020లో  వెస్టిండీస్‌తో   టెస్ట్ మ్యాచ్‌లో సారథిగా వ్యవహరించాడు.  కానీ ఈ టెస్టులో ఓడిపోయాడు. ఇక 2022 జూన్ నుంచి  ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ అయ్యాడు.  స్వదేశంలో న్యూజిలాండ్,  సౌతాఫ్రికాలతో రెండు సిరీస్‌లు గెలుచుకున్నాడు.  భారత్‌తో రీషెడ్యూల్ టెస్టులో కూడా విజయం సాధించాడు. 


పాకిస్తాన్ పర్యటనలో  మూడు టెస్టులనూ గెలిచిన ఇంగ్లాండ్.. తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లి 1-1 తో సిరీస్‌ను  సమం చేసుకుంది.  ఆస్ట్రేలియాతో  యాషెస్‌కు ముందు  ఐర్లాండ్‌తో  అలవోకగా విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్.. యాషెస్ సిరీస్‌లో వరుసగా రెండు టెస్టులనూ ఓడింది.  లీడ్స్‌లో గెలిచి మాంచెస్టర్ టెస్టును వర్షం కారణంగా డ్రా చేసుకుంది. 


 






బెన్ స్టోక్స్.. హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ల హయాంలో ఇదే తొలి డ్రా కావడం గమనార్హం. ఈ ధ్వయం  16 టెస్టులకు గాను  నాలుగు టెస్టులను మాత్రమే ఓడిపోయింది. ఏకంగా 12 గెలిచింది.  ఇంటా బయటా దూకుడు మంత్రంతో దూసుకుపోతున్న ఈ జోడీకి ఇప్పుడు కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగబోయే ఆఖరి టెస్టులో గెలవడం అత్యంత కీలకం కానున్నది. 


ఇదిలాఉండగా  టెస్టులలో  అసలు డ్రా అనేదే లేకుండా  అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం వహించినవారిలో  బెన్ స్టోక్స్ రెండో స్థానంలో నిలిచాడు. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌కు ఇది 17వ   టెస్టు. దక్షిణాఫ్రికా  టెస్టు సారథి డీన్ ఎల్గర్.. 2017-22 మధ్యకాలంలో డ్రా అనేదే లేకుండా 16 టెస్టులలో జట్టును నడిపించాడు.   ఈ జాబితాలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకిబ్ అల్ హసన్.. ఏకంగా 19 టెస్టులలో డ్రా లేకుండా ఉన్నాడు.


కాగా నాలుగు టెస్టులు ముగిసిన ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులు గెలిచిన ఆస్ట్రేలియాకే యాషెస్ దక్కనుంది. ఈ సిరీస్ ‌లో కంగారూలు 2-1 ఆధిక్యంలో ఉన్నారు. చివరి టెస్టు జులై 27 నుంచి  కెన్నింగ్టన్ ఓవల్ (లండన్)‌లో జరుగనుంది.  ఈ మ్యాచ్‌లో గెలిచినా  ఓడినా  ఆస్ట్రేలియాకు పోయేదేమీ లేదు.  ఇంగ్లాండ్  గెలిచి సిరీస్‌ను సమం చేసినా  యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియానే నిలబెట్టుకోనుంది.  



























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial