Ashes 2023: వరుసగా రెండు టెస్టులలో ఓడి తమ ఆటతీరు ‘బజ్‌బాల్’పై విమర్శలు వచ్చినా వెరవకుండా  ఆడుతున్న ఇంగ్లాండ్.. స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో జోరు కొనసాగిస్తోంది.   మాంచెస్టర్  వేదికగా  ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో బెన్ స్టోక్స్ సేన..  గెలుపు దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 592 పరుగుల భారీ స్కోరు చేసి  తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల ఆధిక్యం సాధించిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన ఆసీస్‌ను మూడో రోజు ఆట ముగిసేసమయానికి 4 వికెట్లు కూల్చి కష్టాల్లోకి నెట్టింది. 


బెంబేలెత్తించిన బెయిర్ స్టో.. 


ఓవర్ నైట్ స్కోరు 384 - 4తో మూడో రోజు ఆరంభించిన ఇంగ్లాండ్ అదే దూకుడును కొనసాగించింది.  హ్యారీ బ్రూక్ (61), బెన్ స్టోక్స్ (51) అర్థ సెంచరీలు సాధించారు.   స్టోక్స్ నిష్క్రమించిన తర్వాత వచ్చిన  వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో (81 బంతుల్లో 99 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) తనదైన శైలిలో చెలరేగాడు.  కంగారూ బౌలర్లను మరింత కంగారుపెడుతూ అలవోకగా షాట్లు ఆడాడు.  టెయిలెండర్లు రాణించకున్నా ఒంటరిపోరాటం చేశాడు. మార్క్ వుడ్ (6), స్టువర్ట్ బ్రాడ్ (7), జేమ్స్ అండర్సన్ (5) సాయంతో ఇంగ్లాండ్ స్కోరుబోర్డును పరుగులు  పెట్టించాడు.   అండర్సన్‌ను గ్రీన్ ఎల్బీగా వెనక్కి పంపడంతో  బెయిర్ స్టో సెంచరీ మిస్ అయింది. కానీ ఇంగ్లాండ్ మాత్రం టెస్టును శాసించే స్థితికి చేరింది.


దెబ్బకొట్టిన వుడ్.. 


275 పరుగులు వెనుకబడిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో  తడబడింది. తొలి టెస్టులో సెంచరీ చేసి  తర్వాత విఫలమవుతున్న ఉస్మాన్ ఖవాజా (18) మరోసారి నిరాశపరిచాడు. డేవిడ్ వార్నర్ (28) వైఫల్యాన్ని కొనసాగించాడు. స్టీవ్ స్మిత్ (38 బంతుల్లో 17) తో కలిసి మార్నస్ లబూషేన్ (88 బంతుల్లో 44 నాటౌట్, 6 ఫోర్లు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ మార్క్ వుడ్  దెబ్బకు ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది.  ఖవాజా, స్మిత్ వికెట్లు అతడి ఖాతాలోనే పడ్డాయి. ఇక మూడో రోజు మరో ఐదు ఓవర్లలో ఆట ముగుస్తుందనగా.. ట్రావిస్ హెడ్ (1) ఔటవడంతో ఆసీస్ కష్టాలు రెట్టింపయ్యాయి.  ప్రస్తుతం   లబూషేన్‌తో కలిసి మిచెల్ మార్ష్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 


ఆసీస్‌కు కష్టమే.. 


రెండో ఇన్నింగ్స్‌‌లో ఇప్పటికే  162 పరుగులు వెనుకబడిన ఆసీస్.. ఈ టెస్టులో కోలుకోవడం  కష్టంతో కూడుకున్నదే.  పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై  వుడ్, బ్రాడ్, వోక్స్ చెలరేగుతున్నారు.  లబూషేన్‌తో పాటు మార్ష్, గ్రీన్, అలెక్స్ కేరీలు ఇంగ్లాండ్ బౌలర్లను ఏ మేరకు అడ్డుకుంటారనేది ఆసక్తికరం.  వీళ్లను  త్వరగా ఔట్ చేయగలిగితే ఇంగ్లాండ్ విజయం  నేడే  ఖాయమైపోవచ్చు.  ప్రస్తుతం ఇంగ్లాండ్ బౌలర్ల జోరు చూస్తుంటే ఆసీస్‌కు ఇన్నింగ్స్ ఓటమి తప్పేలా లేదు.


 






టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. 


రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ పేసర్ మార్క్ వుడ్.. ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్ జట్టు ఓ అరుదైన ఘనతను సాధించింది. ఒక ప్లేయింగ్ లెవెన్‌లో వంద లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌లు ఉన్న టీమ్‌గా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుత ఇంగ్లాండ్‌ జట్టులో అండర్సన్ (689), స్టువర్ట్ బ్రాడ్ (600),  మోయిన్ అలీ (201), బెన్ స్టోక్స్ (197), క్రిస్ వోక్స్ (142) లు వంద లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశారు. హెడ్ వికెట్ వుడ్‌కు వందోవది కావడం గమనార్హం. 146 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం.



















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial