WI vs IND: భారత్ - వెస్టిండీస్ జట్లు నేటి నుంచి డొమినికా వేదికగా తొలి టెస్టు ఆడనున్నాయి. ఈ ఇరు జట్లు సుదీర్ఘ ఫార్మాట్‌గా పిలవబడుతున్న టెస్టు క్రికెట్‌లో సుమారు వంద టెస్టులు ఆడాయి. ఇరు జట్ల నుంచి ఎంతో మంది దిగ్గజ ప్లేయర్లు చరిత్రలో తమ పేరును చిరస్థాయిగా నిలుపుకున్నారు. ఆ జాబితాలో కచ్చితంగా ఉండే పేరు అనిల్ కుంబ్లే. ముఖ్యంగా 2002లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు దవడ పగిలి రక్తం కారినా.. తలకు కట్టు కట్టుకుని మరీ బౌలింగ్ చేశాడు జంబో (కుంబ్లే ముద్దుపేరు). అప్పుడు జరిగిన ఘటన గురించి తాజాగా కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కరేబియన్ టీమ్‌తో తొలి టెస్టు నేపథ్యంలో జియో సినిమా యాప్‌లో జరిగిన చర్చలో భాగంగా కుంబ్లే.. 2002 పర్యటనను గుర్తు చేసుకున్నాడు. ‘నేను అప్పుడు నా భార్య (చేతన)కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాను. ఆ తర్వాత నేను ఇంటికి రావాల్సి ఉండటంతో బెంగళూరులో నా సర్జరీకి సంబంధించిన విషయాలన్నీ ఆమె చూసుకుంటుందని అన్నీ తనతో వివరించా. మాటల మధ్యలో నేను బౌలింగ్ చేయబోతున్నాననే విషయం కూడా ఆమెకు చెప్పా. కానీ ఆమె నేను జోక్ చేస్తున్నానేమో అనుకుంది. అసలు ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు..’ అని కుంబ్లే తెలిపాడు.
నాడు అంటిగ్వాలో జరిగిన టెస్టులో కుంబ్లే బ్యాటింగ్ చేస్తుండగా నాటి విండీస్ బౌలర్ మెర్విన్ డిల్లాన్ వేసిన షార్ట్ డెలివరీ కుంబ్లే దవడకు బలంగా తాకింది. ఇంజ్యూర్డ్‌గా పెవిలియన్‌కు వెళ్లిన కుంబ్లే.. తర్వాత విండీస్ బ్యాటింగ్ చేసేప్పుడు బౌలింగ్‌కు వచ్చాడు. అంత నొప్పితో కూడా తలకు కట్టు కట్టుకుని 14 ఓవర్లు బౌలింగ్ చేయడమే గాక బ్రియాన్ లారాను ఔట్ చేశాడు. జట్టు కోసం నాడు కుంబ్లే పోరాడిన తీరు మెచ్చుకోదగింది. ఇప్పుడు చిన్న గాయమైనా నెలలకు నెలల పాటు ఎన్సీఏలో ఉంటూ మ్యాచ్‌లు ఎగ్గొడ్డుతూ ఎంజాయ్ చేసే క్రికెటర్లకు కుంబ్లే పోరాటం ఓ స్ఫూర్తి పాఠం.
లారా చాలా టఫెస్ట్..
తన హయాంలో బౌలింగ్ చేసినవారందరిలో టఫెస్ట్ బ్యాటర్ ఎవరు..? అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘అరవింద డి సిల్వ, బ్రియాన్ లారాలకు బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. లారా.. చాలా టాలెంటెడ్ బ్యాటర్. ఒక బంతి పిచ్‌ను తాకడానికంటే ముందే దానిని మూడు విధాలుగా ఎలా కొట్టాలో ఆలోచించగల సమర్థుడు. బౌలర్ల వ్యూహాలకు అనుగుణంగా తన వ్యూహాలను మార్చుకునేవాడు..’అని చెప్పాడు.
అమ్మో బతికిపోయా..
తాను భారత క్రికెటర్‌ను అవ్వడం వల్ల బతికిపోయాయని, లేకుంటే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి బ్యాటర్లకు బౌలింగ్ చేసే బాధ తప్పిందని కుంబ్లే అన్నాడు. ఒకే జట్టులో ఇంతమంది స్టార్ బ్యాటర్లు ఉంటే వారిని ఔట్ చేయడం ఎవరికైనా తలకు మించిన భారమే అవుతుందని జంబో తెలిపాడు.