Gambhir Virat Kohli Fight IPL 2023 LSG RCB | న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మధ్య ఐపీఎల్ సందర్భంగా గొడవ జరగడం తెలిసిందే. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా అనే తీరుగా కోహ్లీ, గంభీర్‌ల మధ్య వివాదం చెలరేగింది. ప్రస్తుతం గంభీర్ హెడ్ కోచ్‌గా అతడి శిక్షణలో కోహ్లీ ఉండనున్నాడు. వీరి మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలికింది ఎవరు, గొడవ మరిచిపోయి పరస్పరం గౌరవంతో మెలగడానికి గల కారణాలను టీమిండియా మాజీ ఆటగాడు అమిత్ మిశ్రా వెల్లడించాడు. 


యూట్యూబర్ శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా అమిత్ మిశ్రా సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. IPL 2023 సమయంలో లక్నోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో మ్యాచ్ సందర్భంగా గంభీర్, కోహ్లీ మధ్య వివాదం జరిగింది. లక్నో బౌలర్ నవీనుల్ హఖ్ ఓ కారణం కాగా, కోహ్లీ, గంభీర్ దూకుడు వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. బీసీసీఐ సైతం రంగ ప్రవేశం చేసి ఈ ముగ్గుర్నీ మందలించే వరకు వివాదం వెళ్లింది. టీమిండియా మాజీ సహచరులు, ఢిల్లీ ఆటగాళ్ల మధ్య వివాదం సమసిపోవడానికి గంభీరే కారణమని తెలిపాడు. ఆ గొడవ ఎలా ముగిసిందో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తాజాగా బయటపెట్టాడు. 






పెద్ద మనసు చాటుకున్న గంభీర్
మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ పెద్ద మనసు చాటుకున్నాడు. కోహ్లీతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది తనే. గంభీర్ వెళ్లి కోహ్లీని కలిశాడు. కోహ్లీని పలకరించిన గంభీర్.. ఫ్యామిలీ ఎలా ఉంది, ఏం చేస్తున్నారంటూ మాట్లాడాడు. గంభీర్ పలకరింపుతో వీరిద్దరి మధ్య వివాదం ముగిసిపోయిందని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు. కానీ కోహ్లీ నుంచి అలాంటి ప్రయత్నం కనిపించకున్నా, వెటరన్ గంభీర్ గొప్పగా ఆలోచించాడని కొనియాడాడు.


రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ నెగ్గింది. గతంలోనే ద్రావిడ్ టర్మ్ ముగిసింది, కానీ బీసీసీఐ రిక్వెస్ట్ చేయడంతో మరికొంతకాలం హెడ్ కోచ్‌గా కొనసాగాడు. ద్రావిడ్ కోచ్‌గా భారత్ వన్డే ప్రపంచ కప్ ఫైనల్, టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరి రన్నరప్ గా నిలిచింది. ఇటీవల పొట్టి ప్రపంచ కప్ ముద్దాడి ఐసీసీ మెగా ట్రోఫీ కరువు తీర్చుకుంది టీమ్. భారత క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ నియామకం జరిగింది. త్వరలో జరగనున్న సిరీస్‌ నుంచి గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా గంభీర్ జట్టును ఎలా తీర్చిదిద్దుతాడు అనేది ఛాలెంజింగ్ టాస్క్. భారత్ టీ20 వరల్డ్ కప్ నెగ్గడంతో కొత్త కోచ్ గంభీర్ పై పెద్ద టాస్క్ ఉండనుంది. వీటిని గంభీర్ ఎలా అధిగమిస్తాడో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.