WTC Final 2023: పదేండ్ల తర్వాత  ఐసీసీ ట్రోఫీని అందుకోవాలనే తపన ఒకరిదైతే ప్రపంచ క్రికెట్‌పై తిరిగి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే పట్టుదల మరొకరిది.. ఈ నేపథ్యంలో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య  బుధవారం నుంచి ఐసీసీ వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరుగనుంది. తటస్థ వేదిక అయిన  ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత క్రికెట్ స్టేడియం ‘కెన్నింగ్టన్ ఓవల్’ ఇందుకు సిద్ధమైంది.  బుధవారం నుంచి ఇండియా - ఆస్ట్రేలియా మధ్య  మొదలుకాబోతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా  ఓవల్ పిచ్ ఎవరికి అనుకూలంగా ఉంది..? రికార్డులు ఎలా ఉన్నాయి..? వంటి వివరాలు ఇక్కడ చూద్దాం. 


టాస్ గెలిస్తే బ్యాటింగ్‌కే మొగ్గు.. 


క్రికెట్‌ను అమితంగా అభిమానించే ఇంగ్లాండ్‌లో లార్డ్స్  తర్వాత ఓవల్ కూడా ప్రఖ్యాత  క్రికెట్  స్టేడియంగా విరాజిల్లుతోంది.  ఇక్కడ ఇప్పటివరకూ 104  మ్యాచ్‌లు జరుగుగా  టాస్ గెలిచిన జట్టు 88 సార్లు బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 38 మ్యాచ్‌లు గెలుచుకుంది.  బౌలింగ్ ఫస్ట్ చేసిన  టీమ్ 16 మ్యాచ్‌లు మాత్రమే గెలవడం గమనార్హం. 


ఓవల్ పిచ్ సాధారణంగా డ్రైగా ఉంటుంది.  మూడు రోజుల పాటు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్‌కు కూడా  సమంగా అనుకూలిస్తుంది.  కానీ ప్రస్తుతం పిచ్ మీద పచ్చిక ఎక్కువ కనిపిస్తుండటంతో ఓవల్ ఎలా స్పందిస్తుందోనని టీమిండియా ఆందోళన చెందుతున్నది.  గడిచిన పదేండ్లలో ఇక్కడ జరిగిన 9 టెస్టులలోనూ  రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు.  ఇరు జట్లకూ ఫస్ట్ ఇన్నింగ్స్ లలో   పేసర్లకు అనుకూలించే ఓవల్.. తర్వాత మాత్రం బ్యాటింగ్ తో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది.   ఇది టీమిండియాకు కలిసొచ్చేదే...


ఓవల్‌లో గణాంకాలు.. ఘనతలు.. 


- భారత జట్టు ఓవల్‌లో  ఇప్పటివరకూ 14 టెస్టులు ఆడింది.  ఇందులో రెండింటిలో మాత్రమే గెలవగా  ఐదు మ్యాచ్‌లలో ఓడి ఏడింటిని డ్రా చేసుకుంది. 1971లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో గెలిచిన టీమిండియా.. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత 2021లో గెలిచింది. 


- ఆస్ట్రేలియా విషయానికొస్తే.. ఈ వేదికపై  38 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ ఏడు మాత్రమే గెలిచి 17 మ్యాచ్‌లు ఓడి 14 డ్రా చేసుకుంది. 


- ఓవల్‌లో ఆడిన గత ఐదు టెస్టులలో భారత్ ఒక్కటి మాత్రమే గెలిచి మూడు ఓడి ఒకటి డ్రా చేసుకుంది. మరోవైపు ఆసీస్.. ఒక్కటి గెలిచి రెండు ఓడి రెండింటిని డ్రా చేసింది.  


- ఈ పిచ్ పై పేసర్లదే హవా.. మొత్తంగా ఇప్పటివరకు ఇక్కడ పేసర్లు 141 వికెట్లు పడగొట్టగా స్పిన్నర్లు  41  వికెట్లు తీశారు. 


అత్యధిక స్కోర్లు : 


- ఓవల్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టు ఇంగ్లాండ్. 1938లో ఆసీస్ పై జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ ఏకంగా 903-7 పరుగులు సాధించింది. ఆసీస్‌కు ఇక్కడ అత్యధిక స్కోరు 701 (1934 లో ఇంగ్లాండ్ పై) గా ఉంది.  టీమిండియా 2007 పర్యటనలో ఇంగ్లాండ్ పై 664 పరుగుల భారీ స్కోరు చేసింది. 


- టీమిండియా తరఫున ప్రస్తుతం ఆడుతున్నవారిలో ఓవల్‌లో అత్యధిక స్కోర్లు చేసింది  విరాట్ కోహ్లీ. రన్ మిషీన్ 6 ఇన్నింగ్స్‌లలో  169 పరుగులు చేయగా  టీమిండియా సారథి రోహిత్ శర్మ 2 ఇన్నింగ్స్ లలో 138 రన్స్ చేశాడు. జడేజా 45 ఇన్నింగ్స్‌లలో 126 పరుగులు సాధించాడు. టీమిండియా తరఫున ఇక్కడ అత్యధిక వికెట్లు తీసింది రవీంద్ర జడేజా. జడ్డూ 4 ఇన్నింగ్స్ లలో 11 వికెట్లు పడగొట్టాడు. 


- ఆస్ట్రేలియా తరఫున ఓవల్‌లో అత్యధిక పరుగులు (ప్రస్తుత టీమ్) చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్ ముందున్నాడు. స్మిత్..  5 ఇన్నింగ్స్ లలో 391 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ కూడా 5 ఇన్నింగ్స్‌లలో  119 పరుగులు చేశాడు. ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్ 6 ఇన్నింగ్స్ లలో 9 వికెట్లు పడగొట్టాడు. 


ఇండియా లాస్ట్ మ్యాచ్.. శార్దూల్ కేక


భారత జట్టు 2021లో ఇంగ్లాండ్  పర్యటనలో భాగంగా ఇక్కడ మ్యాచ్ (4వ టెస్టు) ఆడింది. ఈ టెస్టులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  ఇండియా.. తొలి ఇన్నింగ్స్‌లో  191 పరుగులకు ఆలౌట్ అయింది.  ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 290 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇండయా.. 466 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ  సెంచరీ (127) సాధించాడు. పుజారా (61) కూడా రాణించాడు.  368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 210 పరుగులకే చేతులెత్తేసింది.  కాగా ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాట్ (57, 60), బాల్‌ (3 వికెట్లు) తో  ఇరగదీశాడు.