Team India Tour Of West Indies: రెండు నెలల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో బిజీబిజీగా గడిపిన టీమిండియా క్రికెటర్లు మళ్లీ అంతర్జాతీయ పోటీలకు రెడీ అయ్యారు. బుధవారం నుంచి టీమిండియా టెస్టు జట్టు.. ఆస్ట్రేలియాతో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. ఇది ముగిశాక భారత జట్టు సుమారు నెల రోజుల పాటు విరామం తీసుకోనుంది. అనంతరం టీమిండియా.. వెస్టిండీస్‌తో మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడేందుకు గాను కరేబియన్ దీవులకు వెళ్లనుంది.
వెస్టిండీస్‌తో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) షెడ్యూల్ తుది కాపీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పంపింది. దీని ప్రకారం జులై 12 నుంచి మొదలయ్యే తొలి టెస్టుతో విండీస్ పర్యటనను మొదలుపెట్టనుంది. ఆగస్టు 13 వరకూ టీమిండియా పర్యటన సాగనుంది.
ఇదే పర్యటనలో టీమిండియా.. వెస్టిండీస్‌తో పాటు అగ్రరాజ్యం అమెరికాలో కూడా మ్యాచ్‌లు ఆడనుంది. అయితే వెస్టిండీస్ పంపిన ఈ ప్రతిపాదనకు బీసీసీఐ ఇంకా అంగీకార ముద్ర వేయాల్సి ఉంది. త్వరలోనే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.
షెడ్యూల్ ఇదే..
జులై 12 - 16 : ఫస్ట్ టెస్టు (డొమినిక)
జులై 20 - 24 : సెకండ్ టెస్టు (ట్రినిడాడ్)
జులై 27 : ఫస్ట్ వన్డే (బార్బోడస్)
జులై 29 : సెండర్ వన్డే (బార్బోడస్)
ఆగస్టు 1 : థర్డ్ వన్డే (ట్రినిడాడ్)
ఆగస్టు 4 : ఫస్ట్ టీ20 (ట్రినిడాడ్)
ఆగస్టు 6 : సెకండ్ టీ20 (గయానా)
ఆగస్టు 8 : థర్డ్ టీ20 (గయానా)
మూడో టీ20 తర్వాత భారత్, వెస్టిండీస్ జట్లు అమెరికా పయనమవుతాయి. అక్కడ ఫ్లోరిడా వేదికగా ఆగస్టు 12, 15 తేదీలలో నాలుగు, ఐదో టీ20 మ్యాచ్‌లు ఆడతాయి.
డిజిటల్ రైట్స్ ‘వయాకామ్’కే..
బీసీసీఐతో ‘స్టార్’ ఒప్పందం ముగిసిన నేపథ్యంలో భారత జట్టు ఇంకా అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఇంకా కొత్త బ్రాడ్‌కాస్టర్ ను తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ సిరీస్ ను టెలివిజన్ లో చూడాలనేవారికి బీసీసీఐ శుభవార్త చెప్పింది. డీడీ స్పోర్ట్స్ లో వెస్టిండీస్ లో జరుగబోయే టీమిండియా మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. డిజిటల్ రైట్స్ మాత్రం ఐపీఎల్ - 16 ను ప్రసారం చేసిన వయాకామ్ 18 (జియో సినిమా) దక్కించుకుంది. ఫ్యాన్ కోడ్ (వెస్టిండీస్ అధికారిక ప్రసారదారు) లో కూడా మ్యాచ్‌లను వీక్షించొచ్చు. కానీ దీనికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
అఫ్గాన్ సిరీస్ వాయిదా..!
ఇదిలాఉండగా భారత్ - అఫ్గానిస్తాన్ మధ్య జూన్‌లో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా పడ్డట్టు తెలుస్తున్నది. ఇందుకుగల కారణాలు తెలియరాలేదు. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువరించికపోయినా డబ్ల్యూటీసీ ఫైనల్స్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు మరింత విరామం దొరకనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ జూన్ 11న ముగిస్తే మళ్లీ జులై 12 వరకూ టీమిండియా ఖాళీగానే ఉండనుంది.