India vs Afghanistan T20I series: భారత్‌(Bharat)తో జరిగే తొలి ద్వైపాక్షిక టీ 20 సిరీస్‌(T20 Series) షెడ్యూల్‌ను అఫ్ఘానిస్థాన్‌(Afghanistan) ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరిలో మూడు టీ20ల సిరీస్‌ కోసం అఫ్ఘాన్‌..భారత్‌కు వస్తోంది. తాజాగా అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు(Afghanistan Cricket Board) ఈ సిరీస్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. టీమ్ఇండియా, అఫ్గాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జనవరి 11న మొహాలీలో జరుగనుంది. ఇండోర్‌లో రెండో టీ 20 మ్యాచ్‌లో ఇరు జట్లు పోటీ పడతాయి. చివరి టీ20 జనవరి 17న బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం( M.Chinnaswamy Stadium)లో జరగుతుంది. షెడ్యూల్‌ను అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పటివరకూ నిర్ణీత ఓవర్ల మ్యాచ్‌లో భారత్-అఫ్గాన్‌ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. ఇదే ఇరు జట్లకు తొలి ద్వైపాక్షిక సిరీస్. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నాయి. ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్‌ కావడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. రేపటి నుంచి ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఆ  తర్వాత దక్షిణాఫ్రికాతోనూ టీ20 సిరీస్‌ ఉంది. ఈ రెండు పర్యటనలు ముగిసిన తర్వాత... అఫ్గానిస్థాన్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. 

 

  భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ అద్భుత పోరాటంతో ఆకట్టుకుంది. ఎటుచూసినా అంధకారమే ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్‌.. అద్భుత ప్రదర్శన చేసి అబ్బురపరిచింది. మూడు ప్రపంచ ఛాంపియన్‌ జట్లను చిత్తు చేసి మరో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించినంత పని చేసింది. అఫ్గాన్‌తో మ్యాచ్‌ అంటే అగ్ర జట్ల కూడా భయపడేలా... సమగ్ర వ్యూహంతో బరిలోకి దిగేలా చేసింది. వరల్డ్ కప్‌లో సెమీస్‌ చేరేందుకు మిగిలిన నాలుగో బెర్తు కోసం చివరి క్షణం వరకు అఫ్గాన్‌ రేసులో నిలిచిందంటే భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఆ జట్టు పోరాటం ఆకట్టుకుంది. ఒకప్పుడు బౌలింగ్‌లో సత్తా చాటి బ్యాటింగ్‌లో చేతులెత్తేసి ఓటమి పాలవ్వడం అప్గాన్‌కు సాంప్రదాయంగా ఉండేది. కానీ ఈ వరల్డ్‌కప్‌లో అప్గాన్ బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. ప్రపంచకప్‌ చరిత్రలోనే ఓ అఫ్గాన్‌ బ్యాటర్‌ సెంచరీ చేసి సత్తా చాటాడు. అంతేనా ఈ పోరాటాలతో అఫ్గాన్‌ ఇక పసికూన జట్టు కాదని.. అగ్ర జట్టని మాజీ క్రికెటర్లు తీర్మానం చేసేశారు.

 

ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకను అప్గాన్‌ మట్టికరిపించింది. ఏదో ఒక జట్టుపై విజయం సాధిస్తే అది గాలివాటం అనుకోవచ్చు. కానీ అఫ్గాన్ జట్టు మూడు ప్రపంచ ఛాంపియన్‌ జట్లను చిత్తు చేసింది. అంతేనా ఆస్ట్రేలియాపై దాదాపు విజయం సాధించినంత పని చేసి కంగారులను కంగారు పెట్టింది. ఈ ప్రపంచకప్‌లో ఆటగాళ్ల ప్రదర్శన అఫ్గాన్‌కు కొత్త ఊపిరి పోసింది. భవిష్యత్‌పై ఆశలు పెంచింది. ఇంగ్లాండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించింది. లక్ష్యాన్ని ఛేదిస్తూ పాకిస్థాన్, శ్రీలంకపై విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికాను వణికించింది. ఎప్పుడూ బౌలర్లు మాత్రమే అఫ్గాన్‌లో మెరుస్తుండేవారు. కానీ ఈసారి అలా కాదు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ అఫ్గాన్‌ బ్యాటర్లు సత్తా చాటారు. ఇబ్రహీం జాద్రాన్‌ 9 మ్యాచ్‌ల్లో 47 సగటుతో 376 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.