Afg vs SL Match Highlights: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అఫ్గానిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రత్యర్థి నిర్దేశించిన 145 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించింది. ధనంజయ డిసిల్వా (66*; 42 బంతుల్లో 2x4, 1x6) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కుశాల్ మెండిస్ (25; 27 బంతుల్లో 2x4, 1x6) అతడికి అండగా నిలిచాడు. అంతకు ముందు అఫ్గాన్‌లో రెహ్మనుల్లా గుర్జాబ్ (28*; 24 బంతుల్లో 2x4, 2x6), ఉస్మాన్ ఘని (27; 27 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్లు.
టాప్ ఆర్డర్ నెమ్మది!
బ్రిస్బేన్ వేదికగా సాగిన ఈ మ్యాచులో అఫ్గాన్ టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్‌కు వచ్చింది. పవర్‌ప్లేలో వికెట్లేమీ నష్టపోకుండా 42 రన్స్ చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్, ఉస్మాన్ ఘని నిలకడగా ఆడారు. దూకుడు పెంచే క్రమంలో గుర్బాన్‌ను ఔట్ చేయడం ద్వారా లాహిరు కుమార విడదీశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇబ్రహీం జర్దాన్ (22) సైతం ఆచితూచి ఆడటంతో 14 ఓవర్లకు అఫ్గాన్ 100కు చేరుకుంది. మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ (3-13), కుమార (2-30) వికెట్లు పడగొట్టడంతో 20 ఓవర్లకు అఫ్గాన్ 144/8తో నిలిచింది.
ధనంజయ దంచికొట్టుడు!
ఛేదనలో లంకకు మొదట్లోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 12 వద్దే పాథుమ్ నిసాంక (10)ను ముజీబుర్ రెహ్మాన్ బౌల్డ్ చేశాడు. నిలకడగా ఆడుతున్న కుశాల్ మెండిస్ (25)ను రషీద్ ఔట్ చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ధనంజయ డిసిల్వా అజేయంగా నిలిచాడు. ఆచితూచి ఆడుతూనే చెత్త బంతుల్ని వేటాడాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వికెట్లు పడుతున్నా అసలంక (19)తో కలిసి మూడో వికెట్‌కు 54(34), రాజపక్స (18)తో కలిసి నాలుగో వికెట్‌కు 42(27) భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 18.3 ఓవర్లకే విజయం అందించాడు.