Kolkata T20 News: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసక ఆట తీరు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కేవలం 34 బంతుల్లోనే 79 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ సునాయసంగా ఏడు వికెట్లతో విజయం సాధించింది. అయితే ఐపీఎల్లో దూకుడుగా ఆడటం వల్లే తన ఆటతీరు బాగా మెరుగైందని అభిషేక్ చెప్పుకొచ్చాడు. గత కొంతకాలంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ ఆడుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి సంచలనాలు నమోదు చేశాడు. అతని ధాటికి చాలా రికార్డులు బద్దలయ్యాయి. అప్పుడు ఐపీఎల్లో ఆడిన అనుభవమే తనకు ఇప్పుడు బూస్టప్‌గా మారిందని అభిషేక్ చెప్పుకొచ్చాడు. బుధవారం కోల్‌కతాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అష్టకష్టాలు పడిన ఈ పిచ్‌పై అభిషేక్ ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. 5 బౌండరీలు, 8 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. 


వాళ్లకు అంకితం.. 
ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేసిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ చేతితో అభిషేక్ ఒక సైగ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దాని గురించి మనసులో మాట పంచుకున్నాడు. కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌‌లకు గుర్తుగా ఈ చిహ్నాన్ని వాడినట్లు తెలిపాడు. వాళ్లిద్దరూ తననెంతో ప్రొత్సహిస్తారని, జట్టులో కూడా ఉత్సాహం నింపుతారని పేర్కొన్నాడు. జట్టు వాతావరణం బాగుందని, సహజ శైలిలో ఆడేందుకు వారి మద్దతు ఎంతో ముఖ్యమని తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేయడం ఆనందంగా ఉందని, బౌలర్ల ప్రతిభ వల్లే పట్టు సాధించగలిగామని తెలిపాడు. నిజానికి తొలుత ఇంగ్లాండ్ తమ ముందు 170-180 పరుగుల టార్గెట్‌ను పెడుతుందని భావించామని, అయితే బౌలర్లు సమష్టిగా రాణించి, 132 పరుగులకే ఇంగ్లీష్ జట్టును ఆలౌట్ చేశారని ప్రశంసించాడు. 


వాటికి కాచుకుని ఉన్నా..
ఇంగ్లీష్ బౌలర్లు తనను షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెడుతారని ఊహించానని, దానికి తగిన ప్రణాళిక వేసుకొచ్చానని అభిషేక్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో 150 కిమీ వేగంతో వేసిన మార్క్ వుడ్‌ను చితక్కొట్టిన అభిషేక్.. 145+వేగంతో బంతులేసే జోఫ్రా ఆర్చర్‌ను కూడా ఊచకోత కోశాడు. అభిషేక్ విజృంభణతో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. మరో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇక ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడే వరుణ్ చక్రవర్తికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం కొట్టిన పిండి. దీంతో తనదైన వ్యూహాలతో ఇంగ్లీష్ బ్యాటర్లను బోల్తా కొట్టించి, మూడు వికెట్లు తీశాడు. వికెట్లకు దగ్గరగా బౌలింగ్ చేయడంతోనే అతనికి మూడు కీలక వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో తనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. కోల్‌కతా టీ20 విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో భారత్ ముందంజలో నిలిచింది. రెండో టీ20 చెన్నైలో ఈ నెల 25న జరుగుతుంది. 


Also Read: Wankhede Stadium Guinness Record: వాంఖెడే స్టేడియంలో  గిన్నిస్ రికార్డు నమోదు.. ఎందుకో తెలుసా..?