Eng Vs Ind Series News: భారత లిమిటెడ్ ఓవర్ల స్పెషలిస్టు పేసర్ అర్షదీప్ సింగ్ చేసిన తాజా పని వైరలయ్యింది. లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‌కు క్షమాపణలు చెప్పడంపై పలువురు షాక్‌కు గురయ్యారు. చేతి వేళ్లు చెవులకు ఆనించుకుని మరీ చాహల్‌కు సారీ చెప్పాడు. ఈ తతంగాన్ని తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేయగా క్షణాల్లో వైరలైంది. ఈ వీడియోపై భారత అభిమానులు కామెంట్లు చేస్తూ, షేర్లు, లైకులు చేస్తూ తెగ వైరల్ చేశారు. ఇంతకీ చాహల్‌కు అర్షదీప్ ఎందుకు సారీ చెప్పాడంటే.. బుధవారం కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు తీసిన అర్షదీప్.. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు చాహల్ (96 వికెట్లు ) పేరిట ఉండగా, తాజాగా 97 వికెట్లతో అర్షదీప్ బద్దలు కొట్టాడు.
మెగాటోర్నీలో ఆడతాడా..?
టీ20ల్లో రెగ్యులర్‌గా ఆడుతున్న అర్షదీప్ వన్డేలు, టెస్టుల్లో మాత్రం ఛాన్సులు రావడం లేదు. 61 టీ20లు ఆడిన అర్షదీప్ కేవలం 8 వన్డేలే ఇప్పటివరకు ఆడాడు. అయితే రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ గాయాల కారణంగా అందుబాటులో లేకపోతే జట్టు తరఫున ఆడే అవకాశం దక్కుతుంది. పిన్ పాయింట్ యార్కర్లు, అద్భుతమైన స్వింగ్‌తో ప్రత్యర్థులను అర్షదీప్ బోల్తా కొట్టించగలడు. మెగా టోర్నీకి ఛాన్స్ దొరికితే రెండు చేతులా ఒడిసి పట్టుకునేందుకు అర్షదీప్ సిద్ధంగా ఉన్నాడు. ఇక ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో పట్టు సాధించాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది. చెన్నైలో ఈ నెల జరిగే రెండో టీ20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
2023 నుంచి దూరంగా చాహల్..
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ చాహల్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. 2023లో తను చివరగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అలాగే తన భార్య ధనశ్రీ వర్మతోనూ దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఇరువురు భార్యాభార్తలు విడివిడిగా ఉంటుండంతో పాటు రూమర్లపై స్పందించకపోవడంతో విడాకుల విషయం ఇంకా జటిలంగా మారింది. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తే బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం చాహల్ భారత జట్టులో రెగ్యులర్‌గా ఆడటం లేదు. దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి తను జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కేవలం దేశవాళీల్లో మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు తన సహ కొరియోగ్రాఫర్‌తో ధనశ్రీ సన్నిహితంగా దిగిన ఫొటోలను చూసి చాహల్ అభిమానులు మండిపడుతున్నారు. చాహల్‌ను ధనశ్రీ మోసం చేసిందని భారీగా ట్రోల్ చేశారు. ఏదేమైనా చాహల్ టీమిండియా తరపున ఆడుతుంటే తన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉండేదని, సెంచరీ వికెట్ల మార్కును ఎప్పుడో దాటేవాడని అభిమానులు పేర్కొంటున్నారు.