Ind Vs Eng T20 Series News: ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టీ20లో ఇంగ్లాండ్ పై గెలిచిన దాని కంటే కూడా వెటరన్ పేసర్ మహ్మద్ షమీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే విషయమే భారత అభిమానులను ఎక్కువగా వేధించి ఉంటుంది. దాదాపు 15నెలలకుపైగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న షమీని ఈ టీ20లో తిరిగి చూస్తామని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. షమీ ఫిట్ గానే ఉన్నప్పటికీ, అతడిని తుదిజట్టులోకి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే కొన్ని కథనాల ప్రకారం షమీ ఎడమ మోకాలిలో కాస్త ఇబ్బంది ఉందని అందుకే ముందు జాగ్రత్తగా తనకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మోకాలి స్వెల్లింగ్ కారణంగానే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో షమీ ఆడలేక పోయాడు. ఇప్పుడు ఫుల్ ఫిట్ గా మారినా, ఈ ఇబ్బందే అతడిని వెనక్కి నెడుతున్నట్లు తెలుస్తోంది.
ముమ్మర సాధన..
నిజానికి తొలి టీ20కి మిగతా ప్లేయర్లతో సమానంగానే షమీ సిద్ధమయ్యాడు. ప్రతి రోజు ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నాడు. ఒక్కోటి గంట చొప్పున ఉండే సెషన్లలో 15 నిమిషాలు వార్మప్, 45 నిమిషాల బౌలింగ్ వేశాడు. నెట్ లో సాధన చేస్తున్నప్పుడు తనకు ఎలాంటి ఇబ్బంది కాలేదని తెలుస్తోంది. చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో షమీ బౌలింగ్ చేసినట్లు సమాచారం. షమీ బౌలింగ్ ను భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షించాడు. షమీ తీరుపై అతడు హేపీ కూడా అయ్యాడని సమాచారం. అయితే ట్రైనింగ్ సెషన్ ముగిశాక, ఎడమ మోకాలిలో కాస్త ఇబ్బంది కారణంగానే తొలి టీ20లో తనకు చోటు దక్కలేదని తెలుస్తోంది. ఇక తొలి టీ20లో ఏడు వికెట్లతో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. చెన్నైలో 25న రెండో టీ20 జరుగుతుంది. ఆ మ్యాచ్ కు షమీ అందుబాటులోకి వస్తాడా..? లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
వెటరన్ పేసర్..
ఆసీస్ పర్యటనలోని సిడ్నీ టెస్టులో వెన్ను నొప్పికి గురైన జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై కాస్త ఆందోళన నెలకొంది. చాంపియన్స్ ట్రోఫీకి తనను ఎంపికా చేసినా, లీగ్ దశ మ్యాచ్ లకు తను అందుబాటులో ఉండేది డౌట్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే ఫుల్లీ ఎక్స్పీరియెన్స్డ్ బౌలర్ అయిన షమీని మెగాటోర్నీకి ఎంపిక చేశారు. అయితే షమీ గాయంపై స్పష్టత లేకపోవడంపై టీమిండియా మేనేజ్మెంట్ లో కాస్త గందరగోళం నెలకొన్నట్లుగా ఉంది. మరోవైపు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన షమీ.. ఇప్పటివరకు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే తన ఫిట్ నెస్ నిరూపించుకోవడం కోసం దేశవాళీల్లో బాగా ఆడాడు. బెంగాల్ తరపున రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీ ఇలా మూడు రకాల ఫార్మాట్లలో ఆడాడు. బాగానే రాణించాడు. అయితే తను ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడతాడు అన్న దానిపైనే పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లోనే దీనికి జవాబు దొరికే అవకాశముంది.
Also Read: Viral Video: ఆర్సీబీ నెగ్గాలని అభిమాని కొత్త ఉపాయం.. నెటిజన్ల మనసు దోచుకున్న వీడియో