కరేబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (CCL)- 2021లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఐదో బంతిని సెయింట్ లూసియా కింగ్స్ పేసర్‌ వాహబ్ రియాజ్ వేయగా సీఫెర్ట్ ఎదుర్కొన్నాడు. పూర్తిగా ఆఫ్ సైడ్ వెళ్లిన ఆ బంతిని(డబుల్‌ వైడ్‌) సీఫెర్ట్ కిందపడి మరి ఆడినా.. అందలేదు. సాధారణంగా దీన్ని ఏ అంపైర్ అయినా వైడ్ అని ప్రకటిస్తాడు. క్రికెట్‌ పరిజ్ఞానం లేని వారు కూడా ఏంటి బంతి అంత పక్కకి వేశాడు అని అనుకుంటారు. అయితే, ఫీల్డ్‌ అంపైర్ నిగెల్ డుగుయిడ్ ఈ బంతిని వైడ్‌గా ప్రకటించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. 


Also Read: T20 World Cup: నాలుగో టెస్టు తర్వాత T20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ప్రకటన... అప్పుడే ఎందుకంటే?






దీనిపై నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ట్రిన్‌ బాగో కెప్టెన్ పొలార్డ్ అసహనం వ్యక్తం చేశాడు. నిర్ధేశిత ప్రాంతంలో కాకుండా వికెట్లకు దూరంగా వెళ్లి 30 యార్డ్‌ సర్కిల్‌ దగ్గర నిలబడి తన నిరసన తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీడియో చూసిన అభిమానుల తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంపైర్ల తప్పిదాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని, వైడ్ బాల్ కూడా థర్డ్ అంపైరే చూసుకోవాలని కామెంట్లు చేశారు.  


Also Read: ICC Test Rankings: కోహ్లీ వెనక్కి... రోహిత్ శర్మ ముందుకు... టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించిన ICC... నంబర్‌వన్‌గా జో రూట్


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్‌ (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్‌), టిమ్ సీఫెర్ట్ (25 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సెయింట్ లూసియా కింగ్స్ పేసర్ కేస్రిక్ విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.